Lulu Mall: కూకట్‌పల్లి లూలూ మాల్‌లో గన్ కలకలం.. పార్కింగ్ లాట్‌లో ఘర్షణ!
Lulu Mall: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లూలూ మాల్ పార్కింగ్ స్థలంలో తీవ్ర కలకలం రేగింది.
Lulu Mall: కూకట్‌పల్లి లూలూ మాల్‌లో గన్ కలకలం.. పార్కింగ్ లాట్‌లో ఘర్షణ!
Lulu Mall: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పరిధిలోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ 'లూలూ మాల్'లో తుపాకీతో ఒక వ్యక్తి హల్‌చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య మొదలైన స్వల్ప వివాదం కాస్తా కొట్లాటకు దారితీయడం, అందులో ఒకరి వద్ద గన్ ఉండటంతో మాల్‌లోని కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు. జూలై 12వ తేదీ ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఆదివారం రాత్రి 9:30 నుండి 10 గంటల మధ్య లూలూ మాల్‌లోని B2 పార్కింగ్ స్థలంలో యాజమాన్యం కొన్ని గృహోపకరణాలను డిస్కౌంట్ సేల్‌కు పెట్టింది. ఆ వస్తువులను కొనేందుకు ప్రజలు భారీగా క్యూలో నిలబడ్డారు. క్యూలో ఎవరు ముందు ఉండాలనే విషయంలో చార్మినార్‌కు చెందిన మహ్మద్ జావేద్ (55), కేరళకు చెందిన ఒక కుటుంబానికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జావేద్ కుమారుడు మహ్మద్ షోఅబుద్దీన్ హైదర్ (18) అవతలి కుటుంబ సభ్యునిపై దాడికి దిగడంతో గొడవ పెద్దదైంది.
పార్కింగ్ స్థలంలో గొడవ జరుగుతుందనే విషయం మాల్‌లోని 4వ అంతస్తులో షాపింగ్ చేస్తున్న జావేద్ మేనల్లుడు మహ్మద్ సిద్ధిఖీకి తెలిసింది. అతను వెంటనే కిందకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయితే సిద్ధిఖీ జేబులో తుపాకీ (గన్) ఉండటాన్ని గమనించిన ఒక అప్రమత్తమైన కస్టమర్ వెంటనే మాల్ సెక్యూరిటీకి, KPHB పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న తుపాకీని పరిశీలించగా.. అది 2029 వరకు చెల్లుబాటులో ఉన్న లైసెన్స్డ్ గన్ అని తేలింది. అతని వద్ద 12 రౌండ్ల తూటాలు కూడా లభ్యమయ్యాయి. బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ సృష్టించినందుకు పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. కేరళ కుటుంబం ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయకపోవడంతో ఆయుధాన్ని తిరిగి సిద్ధిఖీకే అప్పగించారు.
అయితే, ఇంత పెద్ద మాల్‌లోకి ఒక వ్యక్తి తుపాకీతో ఎలా ప్రవేశించాడనే కోణంలో KPHB పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికులను సరిగ్గా తనిఖీ చేయకపోవడం, లోపలికి గన్‌తో వెళ్తున్నా గుర్తించకపోవడం మాల్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పోలీసులు నిర్ధారించారు. భద్రతా లోపాల కారణంగా కస్టమర్ల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు లూలూ మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




