Kavvampalli Satyanarayana: ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన పెను ప్రమాదం.. రెండో అంతస్తు నుంచి పడిపోయిన లిఫ్ట్!

Kavvampalli Satyanarayana: మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 12:16 PM IST
Kavvampalli Satyanarayana
X

Kavvampalli Satyanarayana: ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన పెను ప్రమాదం.. రెండో అంతస్తు నుంచి పడిపోయిన లిఫ్ట్!

Kavvampalli Satyanarayana: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్ అకస్మాత్తుగా ఊడి కిందపడింది. సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యేతో పాటు పలువురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకలు కరీంనగర్‌లోని కెమిస్ట్ భవన్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అక్కడకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి వెళ్లేందుకు భవనంలోని రెండో అంతస్తులో లిఫ్ట్ ఎక్కారు.

లిఫ్ట్ కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నియంత్రణ కోల్పోయిన లిఫ్ట్.. రెండో అంతస్తు నుంచి నేరుగా వేగంగా గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మరో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. నిలువునా కిందకు పడిపోవడంతో లోపల ఉన్నవారంతా ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భవన సిబ్బంది, ఎమ్మెల్యే అనుచరులు రెస్క్యూ చర్యలు చేపట్టారు. కిందపడ్డ లిఫ్ట్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఎమ్మెల్యే సహా మిగతా ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరికీ ప్రాణాపాయం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సురక్షితంగా బయటపడటంతో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story