Komatireddy Venkat Reddy: జూన్ 18న 'చలో హైదరాబాద్' విరమించుకోండి.. తెలంగాణ బిల్డర్లకు మంత్రి కోమటిరెడ్డి హామీ!
Komatireddy Venkat Reddy: బకాయిల చెల్లింపుల కోసం బిల్డర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన 'చలో హైదరాబాద్' నిరసనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.
Komatireddy Venkat Reddy: జూన్ 18న 'చలో హైదరాబాద్' విరమించుకోండి.. తెలంగాణ బిల్డర్లకు మంత్రి కోమటిరెడ్డి హామీ!
Komatireddy Venkat Reddy: బకాయి బిల్లుల విడుదల కోసం 'చలో హైదరాబాద్' నిరసనకు పిలుపునిచ్చిన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల సమస్యలపై వారితో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి.. నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ప్రస్తుత పరిస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు.
సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖలో ఏకంగా రూ. 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది. కాంట్రాక్టర్లు కష్టపడి పనులు చేసినా రూపాయి బిల్లు చెల్లించలేదు. యాదగిరిగుట్టను తామే అద్భుతంగా నిర్మించామని గొప్పలు చెప్పుకునే గత పాలకుల.. అక్కడ పనిచేసిన కాంట్రాక్టర్లకు రూ. 350 కోట్ల బిల్లులను బకాయి పెట్టారు" అని తీవ్రంగా విమర్శించారు.
ఈ నెల 18న బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించ తలపెట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమంపై మంత్రి స్పందిస్తూ.. బిల్డర్ల సమస్యలు జేన్యూన్ అయినవేనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి, ప్రాధాన్యత క్రమంలో బకాయిలు చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో చలో హైదరాబాద్‌ను విరమించుకోవాలని కోరగా.. అసోసియేషన్ ప్రతినిధులు అంతర్గతంగా చర్చించుకుని ఈరోజు సాయంత్రంలోగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారన్నారు.
పత్రికల్లో, మీడియాలో వార్తల కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తమ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. "బట్టకాల్చి తమపై వేస్తే భయపడిపోతామనుకుంటున్నారు. మేం ఎంత పారదర్శకంగా కాంట్రాక్టులు ఇస్తున్నామో రికార్డులు చూస్తే.. తాము పొరపాటుగా మాట్లాడామని హరీశ్ రావు ముక్కు నేలకు రాసి ఒప్పుకుంటారు" అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.




