Pongulet: కేసీఆర్ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. అఫిడవిట్లే సాక్ష్యమంటూ ఫైర్!
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమకారులకు అప్పులే మిగిలాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
Pongulet: కేసీఆర్ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. అఫిడవిట్లే సాక్ష్యమంటూ ఫైర్!
Ponguleti Srinivas Reddy: బీఆర్‌ఎస్ (BRS) పదేళ్ల పాలనలో ఉద్యమకారులకు కేవలం అప్పులే మిగిలాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమకారుల ఆస్తులు కరిగిపోతే.. కేసీఆర్ (KCR) కుటుంబం మాత్రం లక్షల కోట్లు సంపాదించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి పొంగులేటి గట్టిగా బదులిచ్చారు.
2004 ఎన్నికల వరకు కేసీఆర్‌కు ఒక్క ఎకరా భూమి కూడా లేదని, ఆ విషయాన్ని ఆయన స్వయంగా అప్పట్లో ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని పొంగులేటి గుర్తుచేశారు. మరి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఎన్నికల అఫిడవిట్ల ద్వారానే 'కల్వకుంట్ల ముఠా' అడ్డంగా దొరికిపోయిందని విమర్శించారు. పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారని.. అలాంటప్పుడు గతంలో అఫిడవిట్‌లో తప్పు సమాచారం ఇచ్చారా? లేక ఇప్పుడు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. అమరులు, ఉద్యమకారుల త్యాగాల పునాదులపైనే కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులను పోగేసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.




