Ponguleti Srinivas Reddy: కేసీఆర్ కుటుంబం భూములు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్‌ను వాడుకుంది
Ponguleti Srinivas Reddy: ప్రజల ఆస్తుల పరిరక్షణే రెవెన్యూ సంస్కరణల లక్ష్యమని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ కుటుంబం భూములు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్‌ను వాడుకుంది
ప్రజల ఆస్తులను పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని లక్షలాది ఎకరాలను చెరబట్టారని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వారి బండారం బయటపడుతుండటంతోనే సభ నుంచి తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ఎంతో కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణను గత పాలకుల కుటుంబం స్వప్రయోజనాల కోసం పూర్తిగా వాడుకుందని మండిపడ్డారు.
గడిచిన పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం, వారి బంధువులు మాత్రమే ఆర్థికంగా బాగుపడ్డారని, రాష్ట్ర సంపదను యథేచ్ఛగా దోచుకున్నారని ఆరోపించారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రే స్వయంగా తన వద్దే ఉంచుకుని భారీ భూముల అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. భూములు కొల్లగొట్టే కుట్రలో భాగంగానే ధరణి పోర్టల్‌ను ప్రత్యేకంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాల భూమిని గత పాలకులు తమ సొంత ఆస్తిలా భావించారని, ఏమాత్రం నమ్మకం లేని, దివాళా తీసిన విదేశీ సంస్థకు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని దుయ్యబట్టారు.
ధరణి పోర్టల్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని అర్ధరాత్రి వేళల్లో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆరోపించారు. పోర్టల్‌లో దొర్లిన సాంకేతిక తప్పుల కారణంగా లక్షలాది మంది రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చిందని, ఫలితంగా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.




