Ponnam Prabhakar: ఆర్టీసీ విలీనంపై కమిటీ పనిచేస్తోంది.. సమ్మె విరమించండి!
Ponnam Prabhakar: టీజీఎస్ఆర్టీసీ సమ్మె నోటీసుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
Ponnam Prabhakar: ఆర్టీసీ విలీనంపై కమిటీ పనిచేస్తోంది.. సమ్మె విరమించండి!
Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కార్మికులు ప్రకటించిన సమ్మె నోటీసుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు తమ సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. "మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ఎవరైనా వచ్చి తమ సమస్యలను నేరుగా చెప్పుకోవచ్చు" అని ఆయన భరోసా ఇచ్చారు. సమ్మె చేయడం వల్ల సంస్థకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని కోరారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనానికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే కార్మిక సంఘాల ఎన్నికలు, ఇతర సమస్యలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని, ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున కార్మిక సంఘాల నేతలు పునరాలోచించాలని ఆయన కోరారు.




