Seethakka: దీపావళి కానుకగా తెలంగాణలో మరో 4.5 లక్షల మందికి పింఛన్లు!

Seethakka: తెలంగాణ లబ్ధిదారులకు దీపావళి కానుకగా మరో 4.5 లక్షల కొత్త పింఛన్లు. కోడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ.

Arun Chilukuri
Published on: 7 Nov 2026 5:36 PM IST
Seethakka
X

Seethakka: దీపావళి కానుకగా తెలంగాణలో మరో 4.5 లక్షల మందికి పింఛన్లు!

Seethakka: తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా తీపి కబురు అందించింది. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మరో 4.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు 'చేయూత' పింఛన్లను మంజూరు చేయనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

ఈ బృహత్తర పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నవంబర్ 8న వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, మంత్రి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసి ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నారు.

సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ విడత పింఛన్లలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులతో పాటు ఇతర నూతన లబ్ధిదారులకు పెద్దపీట వేశారు. కోడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించే కార్యక్రమం ముగిసిన వెంటనే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పంపిణీ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు.

నూతనంగా పింఛన్లు మంజూరైన ప్రతి ఒక్కరికీ ఈ నెల (నవంబర్) నుంచే నేరుగా వారి ఖాతాల్లో పింఛన్ సొమ్మును జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీపావళి పండుగ వేళ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా విడతల వారీగా పింఛన్లు అందజేస్తామని ఈ సందర్భంగా మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.