Seethakka: కేటీఆర్‌కు 'రాహుల్' ఫోబియా.. మంత్రి సీతక్క సెటైర్లు!

Seethakka: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 16 March 2026 11:36 AM IST
Seethakka: కేటీఆర్‌కు రాహుల్ ఫోబియా.. మంత్రి సీతక్క సెటైర్లు!
X

Seethakka: కేటీఆర్‌కు 'రాహుల్' ఫోబియా.. మంత్రి సీతక్క సెటైర్లు! 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ తన ఉనికిని చాటుకోవడానికే నిరంతరం రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాహుల్‌ను తిడితే పెద్ద నాయకుడు అవుతారా?

"కేటీఆర్‌ను ఎవరూ గుర్తించడం లేదనే ఆవేదనలో ఆయన ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీని నిందించడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. రాహుల్‌ను తిడితే తాను పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భ్రమపడుతున్నారు" అని సీతక్క ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ వైఫల్యాలపై వణుకు ఎందుకు?

కేంద్రంలోని బీజేపీ వైఫల్యాల మీద మాట్లాడాలంటే కేటీఆర్‌కు ఎందుకు వణుకు పుడుతోందని సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆమె కొట్టిపారేశారు.

డ్రగ్స్ దందాపై సూటి ప్రశ్న

"కేటీఆర్.. ఇతరుల గురించి మాట్లాడే ముందు మీ నాయకుల డ్రగ్స్ దందా గురించి సమాధానం చెప్పండి" అంటూ సీతక్క సవాల్ విసిరారు. "మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫామ్‌హౌస్‌లలో కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి చూస్తే, మీరు డ్రగ్స్ సంస్కృతిని ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోంది" అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story