Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుకు మోక్షం.. బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Kaleshwaram : కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ పునరుద్ధరణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. వర్షాకాలం లోపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Revanth Reddy
Kaleshwaram : తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. గత కొంతకాలంగా కుంగిన పిల్లర్లు, సాంకేతిక లోపాలతో నీటి నిల్వకు దూరమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవితవ్యంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అన్నదాతలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) మరమ్మతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీ పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి, వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాథమిక పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల అమలు
మరమ్మతుల విషయంలో కేంద్ర సంస్థలైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సూచనలను తూచా తప్పకుండా పాటించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి చిన్న పనిలోనూ సి.డబ్ల్యూ.సి సభ్యులు ఉండేలా చూడాలని, నీటిపారుదల శాఖతో కలిసి ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలను వేగవంతం చేసి, తుది నివేదిక రాగానే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు.
డెడ్ లైన్ విధించిన సీఎం
పనుల విషయంలో జాప్యాన్ని అస్సలు సహించబోమని అధికారులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి షెడ్యూల్ రూపొందించి, ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని చెప్పారు. పనులకు అవసరమైన భారీ యంత్రాలను వెంటనే సమకూర్చుకోవాలని, మేడిగడ్డ దగ్గర ప్రత్యేకంగా బేస్ క్యాంపు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఒకసారి పనులు మొదలైన తర్వాత తాను స్వయంగా మేడిగడ్డ సందర్శించి పురోగతిని పరిశీలిస్తానని సీఎం ప్రకటించారు.
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
దాదాపు రెండున్నరేళ్లుగా కాళేశ్వరం బ్యారేజీల పరిస్థితిపై సందిగ్ధత నెలకొంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ.. కాళేశ్వరం అనేది ప్రజల ఆస్తి అని, దానిని కాపాడటం తన బాధ్యత అని రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. ఇప్పుడు దానికి అనుగుణంగా టైమ్ బౌండ్ పెట్టుకుని రిపేర్లు చేయాలని నిర్ణయించడంతో ఉత్తర తెలంగాణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం హామీ ఇవ్వడం పనుల వేగానికి మరింత ఊతమివ్వనుంది.


