Job Fraud: మియాపూర్ పరిధిలో భారీ జాబ్ ఫ్రాడ్: విదేశీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల.. బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, ముగ్గురు పరారీ!
Job Fraud: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ జాబ్ ఫ్రాడ్ వెలుగుచూసింది. హఫీజ్‌పేట్‌లోని సీడీ దశరథ్ కన్సల్టెన్సీ విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.
Job Fraud: మియాపూర్ పరిధిలో భారీ జాబ్ ఫ్రాడ్: విదేశీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల.. బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ, ముగ్గురు పరారీ!
Job Fraud: విదేశాల్లో సాఫ్ట్‌వేర్, ఇతర ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఒక ముఠా ఉదంతం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హఫీజ్‌పేట్ పరిధిలో నడుస్తున్న "సీడీ దశరథ్ కన్సల్టెన్సీ" (CD Dasharath Consultancy) నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఈ భారీ మోసానికి పాల్పడింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన నిరుద్యోగులను విదేశీ ఉద్యోగాల పేరుతో ఆకర్షించారు. నమ్మకం కుదిరేలా మాట్లాడి వీసా ప్రాసెసింగ్, జాబ్ గ్యారెంటీ ఫీజుల పేరిట ఒక్కొక్క బాధితుడి నుంచి రూ. 6 లక్షల చొప్పున భారీ మొత్తంలో వసూలు చేశారు. డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం, అడిగితే దాటవేస్తూ రావడంపై బాధితులకు అనుమానం వచ్చింది. తీరా కార్యాలయానికి వెళ్లి చూడగా కన్సల్టెన్సీని మూసివేసి, బోర్డు తిప్పేసినట్లు గుర్తించి బాధితులు లబోదిబోమన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ మోసానికి ప్రధాన కారకులుగా భావిస్తున్న అర్చన, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్ అనే ముగ్గురు నిందితులు ప్రస్తుతం ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ముఠా బారిన పడి మోసపోయిన బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంత మేర సొమ్ము వసూలు చేశారు? అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.




