Paidi Rakesh Reddy: కేటీఆర్ ఒక ఫేక్ మీడియా ఫ్యాక్టరీ.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడమే మా లక్ష్యం

Paidi Rakesh Reddy: తెలంగాణకు కేంద్ర క్యాబినెట్‌లో మరిన్ని అవకాశాలు రావాలని, రాష్ట్రం నుండి మరో మూడు కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 20 May 2026 4:20 PM IST
Paidi Rakesh Reddy
X

 Paidi Rakesh Reddy: కేటీఆర్ ఒక ఫేక్ మీడియా ఫ్యాక్టరీ.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడమే మా లక్ష్యం

Paidi Rakesh Reddy: తెలంగాణకు కేంద్ర క్యాబినెట్‌లో మరిన్ని అవకాశాలు రావాలని, రాష్ట్రం నుండి మరో మూడు కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. 'hmtv' ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అంతర్జాతీయ పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలు, ఇంధన ధరలు మరియు పలు వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల సామాన్యుల నడ్డి విరుస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్లే ఇంధన ధరలపై ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారతదేశంలో కేవలం 0.5 శాతం మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, అదే యూరప్ దేశాలలో అయితే ఏకంగా 60 నుండి 80 శాతం వరకు ధరలు పెరిగాయని ఆయన గణాంకాలను వివరించారు. భారతదేశానికి సరిపడా సొంత ఇంధన నిల్వలు లేవని, మనం 90 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, రానున్న రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను రాకేష్ రెడ్డి తిప్పికొట్టారు. "ప్రధాని మోదీ విదేశాలకు వెళ్తోంది ఒప్పందాలు చేసుకోవడానికి, దేశ ప్రయోజనాల కోసమే తప్ప.. విలాసాలు చేయడానికి కాదు" అని తేల్చి చెప్పారు. విదేశీ మారక ద్రవ్యంపై ప్రజలకు మోదీ కీలక సూచనలు చేశారని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఒక 'ఫేక్ మీడియా ఫ్యాక్టరీ'ని నడుపుతున్నారని, బీఆర్ఎస్ నేతల అసలు బాగోతాలన్నీ తమకు బాగా తెలుసని అన్నారు. ఇక రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే బీజేపీ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మేల్కొలిపి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

బీజేపీ నేత బండి సంజయ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వివాదంపై మాట్లాడుతూ.. "బండి భగీరథ్, ఆ అమ్మాయి ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా సహజం. ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండడానికి మరో మూడు నెలలు మాత్రమే తక్కువ. భగీరథ్‌తో కలిసి ఆ అమ్మాయి, వారి తల్లి అందరూ కలిసి దేవాలయాలకు కూడా వెళ్లారు" అని చెబుతూ, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఆయన కొట్టిపారేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story