MLA Raja Singh: డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ బహిరంగ లేఖ.. గోవుల అక్రమ రవాణాపై తక్షణ చర్యలకు డిమాండ్!

MLA Raja Singh: తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బహిరంగ లేఖ రాశారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న లారీని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ స్వయంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 18 May 2026 3:55 PM IST
MLA Raja Singh
X

MLA Raja Singh: డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ బహిరంగ లేఖ.. గోవుల అక్రమ రవాణాపై తక్షణ చర్యలకు డిమాండ్!

MLA Raja Singh: తెలంగాణలో గోవుల అక్రమ రవాణా వ్యవహారంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల తీరును తప్పుబడుతూ ఆయన తెలంగాణ డీజీపీకి శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గత శనివారం రాత్రి గోవులను అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని గోరక్ష దళ్ కార్యకర్తలు చాకచక్యంగా అడ్డుకున్నారని రాజా సింగ్ లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో ఎంఐఎం (MIM) ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ స్వయంగా అక్కడికి చేరుకుని, పోలీసులను కాదని ఆ లారీని బలవంతంగా తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. బహిరంగంగా గోవుల అక్రమ రవాణాకు మద్దతు పలుకుతూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

"రాష్ట్రంలో చట్టం అనేది హిందువులకైనా, ఎంఐఎం నాయకులకైనా ఒకే విధంగా ఉండాలి. కానీ, పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. కేవలం హిందువులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై అనుమానాలు వస్తాయి. గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలి" అని రాజా సింగ్ డిమాండ్ చేశారు.

మరోవైపు గోమాతను కాపాడతామని ఓ వైపు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇలాంటి అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతోందని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాజా సింగ్ గుర్తుచేశారు. ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సున్నితమైన అంశంపై తెలంగాణ డీజీపీ వెంటనే స్వయంగా స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story