BRS: మూకాంబికా దేవి పూజలను క్షుద్ర పూజలంటారా? కాంగ్రెస్‌పై మండిపడిన ఎమ్మెల్సీ

BRS: మాజీ మంత్రి హరీష్ రావు పూజలపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Aug 2026 11:54 PM IST
BRS
X

BRS: మూకాంబికా దేవి పూజలను క్షుద్ర పూజలంటారా? కాంగ్రెస్‌పై మండిపడిన ఎమ్మెల్సీ

BRS: పవిత్రమైన మూకాంబికా దేవి పూజలను క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ నేతలు హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే కక్షతోనే మాజీ మంత్రి హరీష్ రావు గారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. మహామహులు నడయాడిన గాంధీ భవన్‌ను సీఎం రేవంత్ రెడ్డి నేడు బూతులు, బురద రాజకీయాలకు వేదికగా మార్చేశారు.

ఆరు గ్యారెంటీల అమలులో విఫలమై, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ఈ డైవర్షన్ (క్షుద్ర) రాజకీయాలకు తెరతీసింది. హిందూ దేవతలను కించపరిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. పవిత్రమైన అమ్మవారిని చిల్లర రాజకీయాల్లోకి లాగిన కాంగ్రెస్ నాయకుల నోర్లు పడిపోతాయి.

హరీష్ రావుపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్....

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరాధారమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, తమ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న హరీష్ రావు గారిపై కక్ష గట్టిందని విమర్శించారు.

పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో హరీష్ రావు గారు కుటుంబ సమేతంగా పూజలు చేస్తే, వాటిని క్షుద్ర పూజలుగా చిత్రీకరించి యావత్ హిందూ సమాజాన్ని, వారి విశ్వాసాలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు .

ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారి కామెంట్స్.....

లేనిపోని క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావు గారిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నవి కావు, రాజ్యాంగ నిబద్ధతతో పనిచేయాల్సిన రాజకీయ వ్యవస్థనే విధ్వంసం చేసేలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రాపకం కోసమో, అధిష్టానం మెప్పు కోసమో కాంగ్రెస్ నేతలు సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్ వంటి వారు కనీస సంస్కారం, హేతుబద్ధత లేకుండా మాట్లాడటం శోచనీయం.

కర్ణాటకలోని షిమోగా ప్రాంతం ఆదిగురు శంకరాచార్యులు తిరగాడిన పరమ పవిత్రమైన పుణ్యభూమి. అక్కడి కొల్లూరు మూకాంబిక అమ్మవారు ముగ్గురమ్మల మూలస్వరూపం, శివశక్తి స్వరూపిణి.హరీష్ రావు గారు అక్కడికి వెళ్లి పూజలు చేస్తే వాటిని క్షుద్ర పూజలని ప్రచారం చేస్తారా. తమిళనాడు నాయకుడు విజయ్, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు సైతం మూకాంబిక ఆలయానికి, ఖీర్ భవాని మందిరానికి వెళ్లారు.

వారణాసి కాశీలో పంచబలి పూజలు జరుగుతాయి.. మరి అవన్నీ క్షుద్ర పూజలేనా. సెక్యులరిజం అని రాజ్యాంగంలో రాసుకున్న కాంగ్రెస్ పార్టీయే.. నేడు ఒక మతం నమ్మకాలపై, అమ్మవారి పవిత్రతపై దాడి చేయడం ఎంతవరకు న్యాయమో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమాధానం చెప్పాలి. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని రాజకీయాల్లోకి లాగి అపహాస్యం చేస్తే ప్రకృతి క్షమించదు, మీ నోళ్లు పడిపోవడం ఖాయం. వెంటనే సీఎం, పీసీసీ చీఫ్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి.

కనకపు సింహాసనమున శునకము కూర్చున్నట్టుగా ఉంది నేటి రేవంత్ రెడ్డి పాలన. మహాత్మా గాంధీ స్వయంగా అడుగుపెట్టిన పవిత్ర స్థలం గాంధీ భవన్. దామోదరం సంజీవయ్య, పి.వి. నరసింహారావు, జయపాల్ రెడ్డి వంటి దిగ్గజ మేధావులు మాట్లాడిన ప్రామాణికమైన వేదిక అది. అటువంటి వేదికను ఇవాళ బూతులకు, చిల్లర రాజకీయాలకు అడ్డాగా మార్చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా పాలనపై పట్టు సాధించలేదు. ఆరు గ్యారెంటీల అమలు సున్నా. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే కాలేజీలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. రైతుల ధాన్యం కొనుగోళ్లు లేవు, పెన్షన్ల పెంపు లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేస్తున్నారు.

ఈ చేతగానితనాన్ని, సొంత క్యాబినెట్ మంత్రులలో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ క్షుద్ర పూజల డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ దాగుడుమూతల పూజలు చేయలేదు. తెలంగాణ సాధన కోసం, ప్రజల సుఖసంతోషాల కోసం కేసీఆర్ గారు చండీయాగం చేశారు.

లోకకళ్యాణం కోసం అయుత చండీయాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది. గతంలో ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనపై ఇలాగే క్షుద్ర పూజలు అని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. ఇవాళ హరీష్ రావు గారిపై అదే తరహా నిందలు వేస్తున్నారు.

రాజకీయాలు అంటే విధానాలపై జరిగే హేతుబద్ధమైన చర్చ. అంతే తప్ప తొండల భాష, పేగుల భాష మాట్లాడటం కాదు. దమ్ముంటే విద్యార్థుల సమస్యలపై, ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు రావాలి. వీటన్నింటిపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి.

మాజీ మంత్రి శ్రీ హరీశ్ రావు గారిపై చేసిన నిరాధార, అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మా లీగల్ నోటీసులకు న్యాయస్థానంలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఈ పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గోసుల శ్రీనివాస యాదవ్, అభిలాష్ రంగినేని, కార్తీక్ రాయల తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story