Weather Update : భానుడి భగభగలకు బ్రేక్.. మరో 10 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
Weather Update : నైరుతి రుతుపవనాలు జూన్ 10-12 మధ్య తెలంగాణను తాకనున్నాయి. కేరళలోకి జూన్ 3న ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Weather Update
Weather Update : ఎండల తీవ్రతతో బెంబేలెత్తిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత చల్లటి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించడానికి ముహూర్తం ఖరారైంది. మరో నాలుగైదు రోజుల్లోనే కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాబోయే రెండు మూడు రోజుల్లో గాలుల దిశ మారి, రుతుపవనాలు మరింత ముందుకు కదిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 10 నుంచి 12వ తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం అరేబియా సముద్రం, లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతాలతో పాటు తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ వరకు రుతుపవనాలు చాలా చురుగ్గా విస్తరించాయి. దీనికి తోడు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు ఈ రుతుపవనాల గమనానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. భూమధ్య రేఖను దాటి హిందూ మహాసముద్రంలోకి రుతుపవన మేఘాల రాక ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన ఐఎండీ.. జూన్ 3 లేదా 4వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, ఆ తర్వాత వేగంగా ముందుకు కదిలి మరో పది రోజుల్లో తెలంగాణను ముంచెత్తుతాయని వెల్లడించింది.
రుతుపవనాల రాక కంటే ముందే రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం గణనీయంగా తగ్గనుండటం విశేషం. భాగ్యనగరం హైదరాబాద్లో జూన్ 1వ తేదీ నుంచి పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 36 నుంచి 38 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదవుతూ వడగాల్పుల తీవ్రత పూర్తిగా తగ్గిపోనుంది. ఇక జూన్ 5వ తేదీ దాటిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీల మధ్యే రికార్డవుతాయని, దీనివల్ల ఉక్కపోత నుంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాబోయే ఆది, సోమవారాల్లో వాతావరణం చల్లబడి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే, శనివారం నాడు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్లో శనివారం అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై జనాన్ని వణికించింది. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో వర్షాలు పడనుండటంతో ఈ ఎండల ప్రభావం పూర్తిగా తగ్గిపోనుంది.
మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ శనివారం నాడు ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం చాలా వరకు తగ్గింది. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా సంజామలలో శనివారం 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. కాగా, ఆదివారం నాడు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల మాత్రం గరిష్ఠంగా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.




