Weather Update : ఎండలకు ఎండ్ కార్డ్.. కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
Weather Update : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. రాబోయే వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rains In Telangana
Weather Update : నెలల తరబడి ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఎట్టకేలకు ఒక చల్లని కబురు చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు గురువారం నాడే కేరళలోకి అధికారికంగా ప్రవేశించాయి. ఈ మేరకు ఐఎండీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికే రుతుపవనాలు కేరళకు చేరుకోవాల్సి ఉంది. అయితే, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
కేరళ, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల రాకతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల తీర ప్రాంతాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న దక్షిణ భారత ప్రజలకు ఈ వానలు పెద్ద ఊరటనిచ్చాయి. ఐఎండీ మొదట మే 26నే ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినప్పటికీ, ఎల్‌నినో ప్రభావం వల్ల అంచనాలు తారుమారై జూన్ మొదటి వారానికి దేశంలోకి ప్రవేశించాయి.
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని, రాబోయే వారం రోజుల్లో ఇవి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాల సాధారణ వర్షపాతం 740.6 మి.మీగా ఉండవచ్చని అంచనా వేశారు. అలాగే, ఈ సంవత్సరపు మొత్తం సాధారణ వర్షపాతం 923.8 మి.మీగా ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. అయితే, ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి జూన్-సెప్టెంబర్ సీజన్‌లో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరించారు.
పలు జిల్లాల్లో ముందస్తు ముసురు
రుతుపవనాలు రాకముందే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముందస్తు వర్షాలు మొదలయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసి ప్రజలను అలరించాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో అత్యధికంగా 5.08 సెం.మీ వర్షపాతం నమోదైంది. వానలు పడుతున్నప్పటికీ ఎండల తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం విశేషం. ఏదేమైనా, రాబోయే రోజుల్లో వానలు పడితే ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.




