Weather Update : ఉక్కపోతకు బ్రేక్.. రాబోయే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలే వర్షాలు

Weather Update : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా ప్రవేశిస్తున్నాయి. జూన్ 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

CR Reddy
Published on: 7 Jun 2026 7:33 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోతకు అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఎట్టకేలకు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడంతో జనాలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. నైరుతి రుతుపవనాల గమనంలో వేగం పెరగడమే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవి ఆంధ్రప్రదేశ్‌ను దాటుకుని తెలంగాణ వైపు చాలా చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ముందస్తు ఆగమన సూచనల వల్ల రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు లేదా రేపటికల్లా ఇవి తెలంగాణను పూర్తిస్థాయిలో తాకే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

ఎల్‌నినో అంచనాలు తలకిందులు

సాధారణంగా జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించాలి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రుతుపవనాల రాక ఆలస్యం కావచ్చని, జూన్ 10వ తేదీ తర్వాతే ఇవి కేరళ, ఆంధ్రులను దాటి వస్తాయని వాతావరణ నిపుణులు మొదట అంచనా వేశారు. కానీ వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల వల్ల రుతుపవనాల గమనం ఊపందుకుంది. అంచనాల కంటే ముందే ఇవి రాష్ట్రాన్ని తాకుతుండటంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది.

పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు

శనివారం కురిసిన వర్షపాత వివరాలను పరిశీలిస్తే.. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.4 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ వంటి పలు జిల్లాల్లో కూడా మంచి వానలు పడ్డాయి. ఐటీ హబ్ హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నగరంలో అత్యధికంగా మియాపూర్‌లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఆకస్మిక వానల వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అవడమే కాకుండా ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది.

జూన్ 10 వరకు ఎల్లో అలర్ట్ జారీ

ఈ నెల 10వ తేదీ వరకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు ఉరుములు పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల పక్కన గానీ నిలబడవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరించారు.

పడిపోనున్న ఉష్ణోగ్రతలు

మరోవైపు, శనివారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 3.9 డిగ్రీల సెల్సియస్ అదనంగా పెరిగి 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని హైదరాబాద్‌లో సైతం సాధారణం కంటే 1.7 డిగ్రీలు పెరిగి 38.8 డిగ్రీల వేడి రికార్డయ్యింది. అయితే రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో ఎండల తీవ్రత అంతమైపోనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని అధికారులు స్పష్టం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story