Natural Farming: రసాయన ఎరువులకు స్వస్తి.. ఘన జీవామృతంతో సాగు అద్భుతం!
Natural Farming: సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో పాడి రైతులకు ఘన జీవామృతం తయారీపై వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అవగాహన కల్పించారు.
Natural Farming: రసాయన ఎరువులకు స్వస్తి.. ఘన జీవామృతంతో సాగు అద్భుతం!
Natural Farming: సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామం పాడి రైతులకు జీవామృతం తయారి పైన వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువులు ఉన్న ప్రతి రైతు జీవామృతం తయారీ తెలుసుకోవాలి.
రైతులు వ్యవసాయంలో కేవలం రసాయన ఎరువుల పైన ఆధారపడకుండా పశువులు ఉన్న రైతులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించి రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలని తెలిపారు రైతులు ఘన జీవా మృతాన్ని అనుకూలమైన ఎండాకాలంలో తయారు చేసుకోవాలి. భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టులకు ఇది చక్కని ప్రత్యామ్నాయం. ఎకరానికి ఏటా 400 కిలోలు వేస్తే చాలు.
ఘన జీవామృతాన్ని దుక్కిలో వేసుకోవడంతోపాటు.. నిల్వ చేసుకొని కొద్ది నెలల తర్వాత కూడా అవసరాన్ని బట్టి పంటలకు వేసుకోవచ్చు. వానాకాలం కోసం ప్రస్తుతం ఘన జీవామృతాన్ని తయారు చేసుకోవడం మంచిది . ఘనజీవామృతం తయారీ విధానం.
తయారీకి కావాల్సిన పదార్థాలు:
పశువుల పేడ (వారం రోజుల్లో సేకరించినది) 100 కిలోలు, పశువుల మూత్రం 5 లీటర్లు, ద్విదళ పప్పుల పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు పిడికెడు పుట్టమట్టి లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను.
తయారు చేసే విధానం:
చెట్టు నీడలో లేదా షెడ్డులో ఈ పదార్థాలన్నిటినీ వేసి చేతితో బాగా కలిపి, 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారు చేసిన వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని తదనంతరం వాడుకోవాలనుకుంటే.. దినుసులన్నీ కలిపిన వెంటనే గుండ్రటి ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ ఉండలను గోనె సంచులలో నిల్వ ఉంచుకోవాలి.
సీజన్లో అవసరమైనప్పుడు ఉండలను పొడిగా చేసుకొని పొలంలో వెదజల్లుకోవాలి.ఘన జీవామృతాన్ని ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘన జీవామృతం వేసుకోవాలి. దానితోపాటు.. పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. పంటలకు పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల వెంకట్ స్వామి మరియు రైతులు పాల్గొన్నారు.


