Dharmapuri Arvind: రేవంత్‌ను తీసేసి కోమటిరెడ్డిని సీఎం చేయండి.. నిజామాబాద్ ప్రెస్ మీట్‌లో ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్!
Dharmapuri Arvind: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Dharmapuri Arvind: రేవంత్‌ను తీసేసి కోమటిరెడ్డిని సీఎం చేయండి.. నిజామాబాద్ ప్రెస్ మీట్‌లో ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్!
Dharmapuri Arvind: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా పంగనామాలు పెట్టారని ఆయన మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంతర్గత రాజకీయం, జిల్లా అభివృద్ధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
"టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు మొండిచేయి చూపించారు. జిల్లాకు నిధులు తేవడంలో విఫలమైన మహేష్ కుమార్ గౌడ్, ఇంకా ఏ మొహం పెట్టుకుని జిల్లాలో తిరుగుతున్నారు? నిజామాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా మరిచిపోయారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. దేవుళ్లకే ఇచ్చిన హామీలను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డికి, ప్రజలను మోసం చేయడం ఒక లెక్క కాదు" అని అరవింద్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పటికీ పూర్తికావని అరవింద్ విమర్శించారు. "ఇప్పటివరకు నగరంలో 25 శాతం డ్రైనేజీ పనులు కూడా పూర్తికాలేదు. రూ. 162 కోట్లకు గాను కేవలం రూ. 10 కోట్ల నిధులు మాత్రమే ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కేటాయించింది. ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?" అని ప్రశ్నించారు. అలాగే బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉన్న పట్టణాన్ని అప్‌గ్రేడ్ చేస్తానన్న కేసీఆర్‌నే ప్రజలు నమ్మలేదని.. ఇక లేని, ఊహాజనిత 'ఫ్యూచర్ సిటీ' అంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కారు అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే దానర్థం రాహుల్ గాంధీ ఇక ఎప్పటికీ ప్రధాని కాలేరని, ఇంకో పదేళ్ల పాటు దేశంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు" అని అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్టానానికి సూచన చేస్తూ.. రేవంత్ రెడ్డి కంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి జన్యూన్ పర్సన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తే బాగుంటుందని అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.




