Nizamabad: శుభకార్యాల్లో వేధింపులే కారణమా? హిజ్రాలకు పల్లెల్లో నో ఎంట్రీ బోర్డులు పెట్టడం వెనుక అసలు కథ ఇదే!

Nizamabad: నిజామాబాద్ జిల్లా పల్లెల్లో సరికొత్త వివాదం రాజుకుంది. శుభకార్యాల్లో వేధింపులు, కిడ్నాప్ వదంతుల నేపథ్యంలో హిజ్రాల ప్రవేశాన్ని నిషేధిస్తూ పలు గ్రామాభివృద్ధి కమిటీలు (VDC) తీర్మానాలు చేశాయి.

Arun Chilukuri
Published on: 18 May 2026 4:31 PM IST
Nizamabad
X

Nizamabad: శుభకార్యాల్లో వేధింపులే కారణమా? హిజ్రాలకు పల్లెల్లో నో ఎంట్రీ బోర్డులు పెట్టడం వెనుక అసలు కథ ఇదే!

Nizamabad: ఇందూరు పల్లెల్లో కొత్త వివాదం రాజుకుంది. గ్రామాల్లోకి హిజ్రాలు రాకుండా గ్రామాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఒక్క గ్రామం నుంచి మొదలైన నిషేధం.. ఇప్పుడు పల్లెపల్లెను తాకుతున్నాయి. బిక్షాటనపై ఆధారపడ్డ హిజ్రాలు.. గ్రామాభివృద్ది కమిటీ తీర్మానాలపై ఆందోళన బాట పట్టారు. తమని ఆదరించండి.. అక్కున చేర్చుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు హిజ్రాలు.. గ్రామాభివృద్ది కమిటీలతో చర్చలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు హిజ్రాలు. కొందరు గ్రామంలోకి రావద్దు అంటే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని... వీడీసీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీడిసిలు ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. పల్లెల్లో వీడీసీలు వర్సెస్ హిజ్రాలు అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.

నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 100 మందికి పైగా హిజ్రాలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ నాగారం ప్రాంతంలో నివసిస్తున్నారు. చేతులతో చప్పట్లు కొడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైళ్లలో, శుభకార్యాలకు వెళ్లి జనాల నుండి డబ్బులు అడుగుతారు. కొందరు ఇచ్చినంత తీసుకుంటే హిజ్రాల ముసుగులో మరికొందరు నకిలీ హిజ్రాలు వేధిస్తున్నారట. ఫంక్షన్లలో హంగామా చేస్తారు. హిజ్రాలు వస్తున్నారంటే జనం దడుసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలు హిజ్రాలకు నో ఏంట్రి బోర్డులు పెట్టేశాయి. హిజ్రాలు తమ గ్రామాల్లోకి రావద్దంటూ తీర్మానాలు చేస్తూ ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. హిజ్రాలను పల్లెల్లోకి రాకుండా గ్రామాభివృద్ది కమిటీలు పెడుతున్న ఆంక్షలు వివాదంగా మారుతున్నాయి. గ్రామాల్లోకి థర్డ్ జెండర్లకు ప్రవేశం లేదంటూ.. పల్లెల్లో వెలుస్తున్న ప్లెక్సీలు, గ్రామస్దులు చేస్తున్న తీర్మానాలు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, పెళ్లీలకు హిజ్రాలు చేరుకుని అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడుతుండటంపై గ్రామస్దులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఓ గ్రామంలో బాలుడి కిడ్నాప్ కు హిజ్రాలు ప్రయత్నించారంటూ ఫేక్ వార్త ప్రచారం కావడంతో గ్రామస్ధులు అలెర్ట్ అయ్యారు. దీంతో గ్రామాభివృద్ది కమిటీలతో పాటు.. గ్రామ పంచాయతీ పాలకవర్గం హిజ్రాలకు గ్రామాల్లోకి ప్రవేశం లేదంటూ తీర్మానం చేశాయి. ఈ మేరకు గ్రామ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ, రావుట్ల, బడా భీంగల్, మోపాల్ గ్రామాల్లో హిజ్రాల రాకను పూర్తిగా నిషేధించారు. వీడీసీ ఆంక్షలు లెక్కచేయకుండా గ్రామాల్లోకి అడుగుపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల సిరికొండ మండలం మైలారంలో ఓ బాలుడి కిడ్నాప్ కు విఫలయత్నం జరిగింది. హిజ్రా ముసుగులో ఓ నకిలీ హిజ్రా కిడ్నాప్ కు యత్నించడంతో గ్రామాల్లో ఆందోళన మొదలైంది. ఇది నిరసనలకు... గ్రామాల్లోకి హిజ్రాల ప్రవేశం లేదనే తీర్మానాలకు దారితీస్తోంది. హిజ్రాలు గ్రామాల్లోకి రాకుండా చూడాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మైలారం గ్రామంలో వెలుగు చూసిన కిడ్నాప్ ఆరోపణలతో.. డజన్ కు పైగా గ్రామాల్లో హిజ్రాల ప్రవేశం లేదంటూ.. ప్లెక్సీలు, గోడ ప్రతులు వెలుస్తున్నాయి. శుభకార్యాల్లో హిజ్రాల వేధింపులు పెరిగిపోవడం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని గ్రామస్దులు చెబుతున్నారు.

వీడిసిల ఆంక్షలు గ్రామాల్లోకి రాకుండా చేస్తా తీర్మానాలపై హిజ్రాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది ప్రవర్తనను కారణంగా చూపించి మొత్తం హిజ్రా సమాజాన్ని గ్రామాల్లోకి రానివ్వకపోవడం అన్యాయమంటున్నారు. అయితే గ్రామాల్లోకి రావద్దని నిషేధాజ్ఞలు విధించడంతో మానవ హక్కులకు భంగం కలుగుతుందని హిజ్రాల సంఘం ఆరోపిస్తోంది. తమ పొట్ట కొట్టొద్దని.... గ్రామాల్లో పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ హిజ్రాలు ఆందోళన బాటపడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట హిజ్రాలు ధర్నా చేశారు. కలెక్టర్‌కు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తమను గ్రామాల్లోకి రానివ్వాలని...లేకుంటే తాము ఎలా బతుకుతామని ప్రశ్నిస్తున్నారు. పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ తమపై నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే హిజ్రాలను తమ కుటుంబ సభ్యులు దూరం పెట్టారని... ఇప్పుడు సమాజం దూరం పెడితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఫ్లెక్సీలు పెట్టి హిజ్రాల ప్రవేశాన్ని నిషేధించడం తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ పల్లెల్లో గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం రాష్ట్రస్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. తమను ఆదరించాలని పోరుబాట పట్టిన హిజ్రాలకు గ్రామస్తులు ప్రవేశం కల్పిస్తారా.... చర్చలకు వెళ్లే ట్రాన్స్ జెండర్ సంఘాలతో సమావేశం అవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story