Hyderabad MMTS: బంపర్ ఆఫర్: ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం!
Hyderabad MMTS: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Hyderabad MMTS: బంపర్ ఆఫర్: ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం!
Hyderabad MMTS: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. జూన్ 2వ తేదీ నుంచి ఈ చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం: సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు, సామాన్యుడిపై రవాణా భారాన్నితగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ పథకానికి ఆయన ఆమోదం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.
ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా, రైల్వేకు వచ్చే ప్రస్తుత ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది.
ఆదరణ పెంచేందుకు సరికొత్త ప్రణాళికలు
ఒకప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో రోజుకు లక్షకు పైగా ప్రయాణికులు ఉండేవారు. కానీ ప్రస్తుతం రైళ్ల సంఖ్య తగ్గడం, సమయపాలన లేకపోవడంతో ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖను కోరింది. రైళ్లు నిర్ణీత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణికులు ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
రైల్వే శాఖ స్పందన
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఉచిత ప్రయాణానికి సంబంధించి ఒప్పంద పత్రాన్ని (ఎంఓయూ) పంపాలని కోరింది. రైల్వే బోర్డు నుంచి తుది అనుమతులు వచ్చిన తర్వాత ఈ పథకం పట్టాలెక్కనుంది. అయితే, ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ. 491.45 కోట్లను కూడా విడుదల చేయాలని రైల్వే శాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, నగర ప్రయాణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.




