Telangana News: ప్రయాణికులకు అలర్ట్.. ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు బంద్!

Telangana News: Ola, Uber, Rapido Drivers Strike in Telangana on July 22. తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఆధారిత రవాణా, డెలివరీ సేవలు మంగళవారం బంద్ కానున్నాయి.

Rishvik
Published on: 21 July 2026 7:54 PM IST
Telangana News
X

Telangana News: ప్రయాణికులకు అలర్ట్.. ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు బంద్!

Telangana News: తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఆధారిత రవాణా, డెలివరీ సేవలు మంగళవారం (జూలై 22) పూర్తిగా బంద్ కానున్నాయి. ఓలా, ఉబెర్, ర్యాపిడోకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు సహా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, అలాగే గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో పాల్గొననున్నారు.

ముషీరాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో ఈ సమ్మె నిర్ణయాన్ని ప్రకటించారు. సమ్మె కారణంగా తెలంగాణలో ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు అందుబాటులో ఉండవు. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్యాయం చూసుకుంటే.. గమ్య స్థానాలకు సులువుగా చేరుకోవచ్చు.

కార్మిక సంఘాల సమావేశంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడారు. ఈ సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లతో పాటు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో తదితర యాప్ సేవల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. కనీస బేస్ ఫేర్ నిర్ణయించడం, ప్రతి కిలోమీటర్‌కు, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలు అమలు చేయడం తమ ప్రధాన డిమాండ్లు అని యూనియన్ నేతలు తెలిపారు.

అంతేకాకుండా గిగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, అగ్రిగేటర్ కంపెనీలపై కఠిన నియంత్రణ తీసుకురావడం, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ రూల్స్‌ను వెంటనే అమలు చేయడం, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం, అలాగే మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, అగ్రిగేటర్ కంపెనీలు సానుకూలంగా స్పందించకపోతే.. ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని షేక్ సలావుద్దీన్ హెచ్చరించారు. ఈ ఉద్యమం కేవలం వేతనాల పెంపు కోసం మాత్రమే కాదని, గిగ్ కార్మికులకు కార్మిక హక్కులు, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్న పోరాటమని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story