Kapra: ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి.. వేలం ఆపకపోతే ఆందోళన తప్పదు
Kapra: కాప్రా చర్లపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వాణిజ్య సముదాయాల వేలం ఆపాలని సీపీఐ(ఎం) డిమాండ్.
Kapra: ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి.. వేలం ఆపకపోతే ఆందోళన తప్పదు
Kapra: డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద వాణిజ్య సముదాయాల వేలంపాటను వెంటనే నిలిపివేసి, లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు.మేడ్చల్–మల్కాజిగిరి సీపీఐ(ఎం) బృందం మంగళవారం కాప్రా సర్కిల్ పరిది లోని చర్లపల్లి డబుల్ బెడ్ రూం ఇండ్లను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు అనంతరం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పి.సత్యం మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వాణిజ్య సముదాయాలను వేలంపాటకు పెట్టడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
గతంలో ఈ సముదాయాలను సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో అద్దెకు ఇచ్చి, లిఫ్ట్ నిర్వహణ, విద్యుత్, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వేలంపాట ద్వారా వచ్చే ఆదాయంతో సమస్యలు పరిష్కరిస్తామనడం సరైన విధానం కాదన్నారు. వేలం ద్వారా వచ్చే నిధులు కొద్ది కాలానికే ఖర్చవుతాయని, దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో అక్కడ నివసించే ప్రజలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అందుకే వేలంపాటలను రద్దు చేసి, ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి మాట్లాడుతూ.. గతంలో లీజుకు ఇచ్చినవారు అద్దెలు చెల్లించకపోవడం వల్లే ఇప్పుడు వేలంపాటకు వెళ్తున్నామన్న ప్రభుత్వ వాదన సరికాదన్నారు. ఇది బాధ్యత తప్పించుకునే ప్రయత్నమని ఆరోపించారు. లీజు వ్యవస్థలోనే కఠిన నిబంధనలు అమలు చేసి, అద్దె చెల్లించని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు.
వాణిజ్య సముదాయాలను స్థానిక సంక్షేమ సంఘాలకు అప్పగిస్తే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 12 కేంద్రాల్లో 892 దుకాణాలను వేలంపాట ద్వారా విక్రయించనున్నట్లు వచ్చిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పి.గణేష్, బి.వి.సత్యనారాయణ, బాబురావు అసోసియేషన్ సభ్యులు గణేష్, రమేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


