Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై వేటు..? హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల వేడి..!
Padi Kaushik Reddy: హుజూరాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు, అనర్హత వేటు ప్రచారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై వేటు..? హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల వేడి..!
Huzurabad Bypoll: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో ఆయన ప్రవర్తనపై వేలాడుతున్న అనర్హత వేటు కత్తి, స్థానికంగా నడుస్తున్న రాజకీయ పరిణామాలు హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో జరిగిన వాగ్వాదం, చూపుడు వేలుతో హెచ్చరించిన ఘటన తీవ్ర వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దీనిని సీరియస్‌గా తీసుకుంది.
ఎథిక్స్ కమిటీ నోటీసులకు స్పందించిన కౌశిక్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ 12 పేజీలతో కూడిన సుదీర్ఘ లిఖితపూర్వక వివరణను సమర్పించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందిందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ అంశంపై శుక్రవారం జరగాల్సిన ఎథిక్స్ కమిటీ సమావేశం తీర్పును నవంబర్ 5వ తేదీకి వాయిదా వేయడంతో.. కౌశిక్ రెడ్డి భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎథిక్స్ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఒకవైపు ఉంటే, మరోవైపు హుజూరాబాద్‌లో ఇప్పుడే ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
వీణవంక మండలానికి మాత్రమే పరిమితమైన యుప్‌టీవీ సీఈవో పాడి ఉదయానందన్ రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చి నియోజకవర్గంలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అవి చించివేయడం వంటి పరిణామాలు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచాయి. దసరా, బతుకమ్మ పండుగ వేళ వివిధ పార్టీల నేతలు ప్రజలను పలకరిస్తూ సాగిస్తున్న పర్యటనలు స్థానికంగా ఉప ఎన్నికల సంకేతాలను బలపరుస్తున్నాయి.
ఒకవైపు ఎథిక్స్ కమిటీ తీర్పు నవంబర్ 5న రానుండటం, మరోవైపు హుజూరాబాద్‌లో ప్రధాన పార్టీల నేతలు ముందస్తు వ్యూహాలతో గ్రౌండ్ ప్రిపరేషన్ మొదలుపెట్టడంతో పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.




