Padi Kaushik Reddy: పొంగులేటి కంపెనీల్లో సీఎంకు వాటా.. అందుకే హౌస్ కమిటీ వేయడం లేదు

Padi Kaushik Reddy: అసెంబ్లీలో మైనింగ్ స్కాంపై హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 1 April 2026 1:14 PM IST
Padi Kaushik Reddy
X

Padi Kaushik Reddy: పొంగులేటి కంపెనీల్లో సీఎంకు వాటా.. అందుకే హౌస్ కమిటీ వేయడం లేదు

Padi Kaushik Reddy: అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మైనింగ్ స్కాం, తనపై వేసిన ఎథిక్స్ కమిటీ మరియు సీఐడీ నోటీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మైనింగ్ స్కాంపై హౌస్ కమిటీ వేయాల్సిందే!

రాష్ట్రంలో జరిగిన మైనింగ్ స్కామ్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. "హరీష్ రావు అడిగినట్లు మైనింగ్ అవకతవకలపై హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కంపెనీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది కాబట్టే ప్రభుత్వం వెనకాడుతోంది" అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఎథిక్స్ కమిటీపై ధ్వజం

తనపై ఎథిక్స్ కమిటీ వేయడాన్ని కౌశిక్ రెడ్డి తప్పుబట్టారు. "అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాడే భాషపై, ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి కనిపించడం లేదా? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అని ప్రశ్నించారు.

తన ఫిజిక్ గురించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "నేను స్పోర్ట్స్ పర్సన్‌ని. అండర్-19 ఆడే సమయంలోనే దేశంలోనే అత్యంత ఫిట్ ప్లేయర్‌గా ఉన్నాను. 20 ఏళ్ల కష్టం ఈ పర్సనాలిటీ. దీనిపై ఏడిస్తే ఎలా?" అని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీ ముందు అన్ని విషయాలు స్పష్టంగా చెబుతానని వెల్లడించారు.

సీనియర్ నేత కడియం శ్రీహరి తీరుపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. "కేసీఆర్ గారు కడియం శ్రీహరికి ఏది తక్కువ చేశారు? అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ముందు చెప్పు అని అసెంబ్లీలోనే అడిగాము" అని ఎద్దేవా చేశారు.

హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నెల 4న తలపెట్టిన కార్యక్రమానికి వెళ్లవద్దని సీఐడీ నోటీసులు ఇచ్చిందని కౌశిక్ రెడ్డి తెలిపారు. "4వ తేదీన సీఐడీ విచారణకు వెళ్తాను. కానీ 5 లేదా 6వ తేదీల్లో కచ్చితంగా హుజురాబాద్ వెళ్లి డంపింగ్ యార్డును అడ్డుకుంటాను" అని స్పష్టం చేశారు. కరీంనగర్ సీపీపై వేయాల్సిన ఎంక్వైరీ తనపై వేశారని, భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ సీఐడీ విచారణ పోలీసుల మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story