Pargi: కుక్కల రాజ్యం.. జనాల గుండెల్లో భయం!
Pargi: పరిగి పట్టణంలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Pargi: కుక్కల రాజ్యం.. జనాల గుండెల్లో భయం!
Pargi: పరిగి పట్టణం ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది! అడుగు బయట పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎటు చూసినా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు.. ఎప్పుడు, ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. అసలు పరిగిలో పాలన ఉందా? లేక కుక్కల రాజ్యమే నడుస్తోందా? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలో వీధి కుక్కలు తమ ప్రతాపాన్ని చూపించాయి.
ఒక మేకపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మూగజీవాల ఆర్తనాదాలు వినే నాథుడే కరువయ్యారు. ఇది కేవలం మేకపై దాడి మాత్రమే కాదు.. రేపు మీ ఇంటి పిల్లలపై జరిగే దాడికి హెచ్చరిక! అని చెప్పవచ్చు .పోలీస్ స్టేషన్ సమీపంలోనే అటుగా వెళ్తున్న ఓ బాలుడు పై కుక్కలు దాడికి యత్నించాయి. తృటిలో ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ బాలుడి కళ్లల్లో కనిపించిన భయం మున్సిపల్ అధికారులకు కనిపిస్తోందా?
"ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదా? వీధి కుక్కల నియంత్రణకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏవి?" నిర్లక్ష్యం ఎందుకు? పట్టణంలో కుక్కల సంఖ్య పెరుగుతున్నా మున్సిపల్ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర పోతోంది? నిధులు ఏమౌతున్నాయి? యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) ప్రోగ్రామ్స్ పరిగిలో అమలు అవుతున్నాయా?
ప్రాణాలు పోవాలా? ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతే కానీ మీరు కుర్చీల నుంచి కదలరా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.




