Pawan Kalyan: మాట ఇచ్చిన పవన్.. అంతలోనే లోకాన్ని విడిచి వెళ్లిన చిన్నారి అభిమాని నిరంజన్!
Pawan Kalyan: జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూశారు.
Pawan Kalyan: మాట ఇచ్చిన పవన్.. అంతలోనే లోకాన్ని విడిచి వెళ్లిన చిన్నారి అభిమాని నిరంజన్!
Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమానుల్లో ఒకరైన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, శారీరక ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమైన నిరంజన్ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిరంజన్ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో జనసేన శ్రేణులు, పవన్ కల్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
గత నెలలోనే హనుమకొండ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో నిరంజన్‌ను పవన్ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించి, కలిసి సెల్ఫీ దిగారు. ఆ సమయంలో తనకు కుక్కపిల్ల అంటే ఇష్టమని నిరంజన్ చెప్పగా.. ‘కొని పంపిస్తా చిన్నా’ అంటూ హామీ ఇచ్చి, చెప్పినట్లుగానే అదే రోజు కుక్కపిల్లను నిరంజన్ ఇంటికి పంపించారు పవన్.
అంతేకాదు, సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు.. "మనం 'OG 2' సినిమా తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్.. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం" అని పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు. తన అభిమాన హీరో పక్కన కూర్చుని 'ఓజీ 2' సినిమా చూడాలనే బలమైన కోరికతో ఉన్న నిరంజన్.. ఆ సినిమా విడుదల కాకముందే, పవన్ ఇచ్చిన మాట తీరకముందే ఇలా లోకాన్ని విడిచి వెళ్లడం అభిమానులను, ఆ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. సోషల్ మీడియా వేదికగా నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




