Pawan Kalyan: అభిమాని కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. అండగా ఉంటానంటూ భరోసా..!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ప్రాణాంతక నరాల వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల యువ అభిమాని నిరంజన్‌ను పరామర్శించి, రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

Arun Chilukuri
Updated on: 17 Jun 2026 12:50 PM IST
Pawan Kalyan
X

అభిమాని కోసం హనుమకొండకు పవన్ కల్యాణ్.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించి, తానున్నానంటూ జనసేనాని భరోసా!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన యువ అభిమాని నిరంజన్ కోరిక మేరకు పవన్ కల్యాణ్ హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు విచ్చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టిన పవన్ కల్యాణ్‌ను చూసేందుకు దారిపొడవునా అభిమానులు, జనసైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పవన్ కల్యాణ్ నేరుగా బాలుడి నివాసానికి చేరుకున్నారు.

హనుమాన్ నగర్‌కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ గత కొంతకాలంగా ప్రాణాంతకమైన నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి తీవ్రత కారణంగా 15 ఏళ్ల వయసున్నప్పటికీ.. చూసేందుకు రెండు, మూడేళ్ల పిల్లాడిలాగే కనిపిస్తున్నాడు. పైగా కాళ్లు కూడా పనిచేయని స్థితిలో ఉన్నాడు. నిరంజన్ పరిస్థితిని చూసి పవన్ కల్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. బాలుడిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని పలకరిస్తూ, "నేను ఉన్నాను.. అధైర్యపడొద్దు" అంటూ కొండంత భరోసా ఇచ్చారు.

అనారోగ్యంతో ఉన్నప్పటికీ తన ఆరాధ్య దైవం కళ్లముందే ఉండటంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్ సినిమాల్లోని పవర్‌ఫుల్ డైలాగులను బాలుడు చెబుతుంటే జనసేనాని ఎంతో ఆసక్తిగా, మురిపెంగా విన్నారు. బాలుడితో కలిసి ఆత్మీయంగా సెల్ఫీలు దిగారు. అనంతరం నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి, అందుతోన్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన వంతు తక్షణ సహాయంగా నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

అభిమాని నిరంజన్ కుటుంబానికి భరోసా ఇచ్చిన అనంతరం పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం స్థానిక రిసార్ట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో (జనసైనికులతో) ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. అక్కడే లంచ్ (మధ్యాహ్న భోజనం) ముగించుకుని, అనంతరం తిరిగి విజయవాడకు తిరుగుపయనమవనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story