Mancherial : మంచిర్యాలలో ఘోరం.. వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు
Mancherial : మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఒంటరిగా ఉంటున్న 80 ఏళ్ల లక్ష్మి మృతి చెందగా, ఆమె పెంచుకున్న పిల్లులు ఆమె మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Pet Cats Eat Elderly Owners Body
Mancherial : మంచిర్యాల జిల్లాలో మనసును కలిచివేసే అత్యంత విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు పిల్లులే ఆకలి తట్టుకోలేక యజమానురాలి మృతదేహాన్ని పీక్కుతిన్న ఘటన మందమర్రిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మందమర్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) అనే వృద్ధురాలు తన భర్త రాజీరు మరణించినప్పటి నుంచి సుమారు 16 ఏళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నప్పటికీ అందరికీ పెళ్లిళ్లయి వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న తల్లి యోగక్షేమాలను రెండో కుమారుడు సముందర్ వారానికి రెండు సార్లు వచ్చి చూసి వెళ్తుండేవాడు.
అయితే, గత నాలుగు రోజులుగా సముందర్ తల్లి దగ్గరకు రాలేకపోయాడు. ఈ క్రమంలోనే గురువారం నాడు లక్ష్మి తన ఇంట్లోని గడప వద్దే ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయి మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె చనిపోయిన విషయం ఎవరికీ తెలియలేదు. గురువారం రాత్రి ఇల్లు చీకటిగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ లక్ష్మి అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు, ఆమె కుమారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుమారుడు సముందర్ రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ హృదయవిదారక దృశ్యం కనిపించింది.
లక్ష్మి చనిపోయి పడి ఉండగా.. ఆమె అల్లారుముద్దుగా పెంచుకున్న రెండు పెంపుడు పిల్లులు ఆమె చేతిని దారుణంగా కొరికి పీక్కుతింటున్నాయి. వృద్ధురాలి చేతి చర్మం పిల్లుల నోటి వద్ద ఉండటంతో అవి ఎంత ఘోరంగా దాడి చేశాయో అర్థమై అందరూ షాక్కు గురయ్యారు. బహుశా యజమానురాలు చనిపోయి ఉండటంతో ఆహారం దొరకక ఆకలితో ఆ పిల్లులు ఇలా చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రాణులే ఇలా మృతదేహాన్ని వికృతం చేయడం అందరినీ కలచివేసింది.
ఈ ఘటనపై మృతురాలి పెద్ద కుమారుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి మరణంపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయి చనిపోయిందని వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లల్లా చూసుకునే పెంపుడు జంతువులే ఇలా యజమానురాలి శరీరాన్ని పీక్కుతినడం మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.




