PM Modi: ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ కీలక పిలుపు!
PM Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
PM Modi: ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ కీలక పిలుపు!
PM Modi: అంతర్జాతీయ పరిణామాలు మరియు పెరుగుతున్న ధరల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చమురు, బంగారం దిగుమతులు మరియు స్వదేశీ విధానంపై దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. "దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి. వీలైతే ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేద్దాం" అని ఆయన ప్రజలను కోరారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్‌లను తగ్గించుకోవడం ద్వారా దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని సూచించారు.
యుద్ధాల కారణంగా పొరుగు దేశాల్లో ఇంధన ధరలు పెరిగినా, భారత్‌లో ఆ భారం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రధాని తెలిపారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, రైల్వేలో డీజిల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా చమురు దిగుమతులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతుందని వెల్లడించారు. వంట నూనెల దిగుమతిని తగ్గించి, ఆ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల వినియోగంలో స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. ప్రపంచవ్యాప్తంగా యూరియా బస్తా ధర రూ.3,000 ఉంటే, భారత్‌లో రైతులకు రూ.300 కే అందిస్తున్నామని గుర్తు చేస్తూ, భూసారం పెంచేందుకు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని కోరారు."స్వదేశీ కేవలం ఒక నినాదం కాదు, అది దేశ విధానం. నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులనే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలి" అని మోదీ పిలుపునిచ్చారు.




