Kalluru: కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన

Kalluru: కల్లూరులో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 14 April 2026 9:24 PM IST
Kalluru
X

Kalluru: కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన

Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, తల్లాడ మండలంలో జీపీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి,

ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

మంగళవారం మంత్రి, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో సుమారు 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. యంగ్ ఇండియా పాఠశాలలు అలాంటి ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటని, ప్రతి పాఠశాల సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతున్నదని తెలిపారు. అభివృద్ధి కేవలం కాగితాలపై కాకుండా క్షేత్ర స్థాయిలో కనిపించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం విస్మరించిందని, ప్రజా ప్రభుత్వం ప్రస్తుతం మొదటి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే రెండో దశ ప్రారంభించి, తరువాత మూడో, నాలుగో దశల్లో కూడా ప్రతి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు.

విద్యే పేదలకు ప్రభుత్వం అందించే అత్యంత విలువైన ఆస్తి అని పేర్కొన్న మంత్రి, ప్రతి నియోజకవర్గంలో సుమారు 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మించి అన్ని వర్గాల, మతాల పిల్లలు ఒకేచోట చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాను కల్లూరుకు చెందిన వాడినని, కల్లూరు యంగ్ ఇండియా పాఠశాలను పాలేరు కంటే ముందే పూర్తి చేసేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఆరోగ్య రంగానికీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సత్తుపల్లి ప్రాంతంలో రేపు మూడు కొత్త ఆసుపత్రులను ప్రారంభించనున్నామని తెలిపారు.

ఒక కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, తొలి సంవత్సరంలోనే నిరుద్యోగ యువతకు 72 వేల ఉద్యోగాలు కల్పించామని అన్నారు. 25 లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల వరకు 20 వేల 654 కోట్ల రుణమాఫీ, రైతు భరోసా ఎకరాకు 12 వేల వరకు పెంపు, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం కేవలం జీఓలు ఇచ్చిన పంచాయతీ, ఆర్ అండ్ బీ రోడ్ల పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందని,రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. యంగ్ ఇండియా పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

రహదారి పనులు పూర్తి చేయడానికి రైతులు సహకరించాలని, అవసరమైన చోట భూములు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అవసరమైన చోట ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములు కూడా కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగడం ఎంతో ఆనంద దాయకమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు 100 యంగ్ ఇండియా పాఠశాలలను నిర్మిస్తుండగా,

ఖమ్మం జిల్లాలో సుమారు 5 పాఠశాలలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ప్రతి పాఠశాల సుమారు 2500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉత్తమ విద్యా అవకాశాలు కల్పించడం లక్ష్యమన్నారు.

నిర్మాణ పనులకు సంబంధించిన చెల్లింపులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బిల్లులు సమర్పించిన వారంలోనే చెల్లింపులు పూర్తి చేసే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విద్యాసంస్థలు సమాజంలో బలమైన పునాది వేస్తాయని అన్నారు. ఖమ్మం జిల్లాకు మంజూరైన 5 యంగ్ ఇండియా పాఠశాలలను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా యంగ్ ఇండియా పాఠశాలకు శంకుస్థాపన జరగడం చాలా ఆనంద దాయకమని తెలిపారు. ఇంత ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వమే ఇలాంటి పాఠశాలలను నిర్మిస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్గం కలిసి ఒకేచోట 2500 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాలలను రూపకల్పన చేశారని తెలిపారు.

విద్య పేద ప్రజల జీవితాలను పూర్తిగా మార్చగలదనే బలమైన నమ్మకం ముఖ్యమంత్రికి ఉందని, అదే దృష్టితో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. పాత సిలబస్ కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఏటీసీ కేంద్రాల ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ, ప్రభుత్వ విద్యాభివృద్ధికి పలు సంస్కరణాత్మక చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ యంగ్ ఇండియా పాఠశాల విద్యా అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు. మంత్రి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఈ పాఠశాలను రికార్డు సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనంతరం తల్లాడ మండలం బాలపేటలో 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, తల్లాడ గ్రామంలో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుందర, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పవతి, వాణిశ్రీ, తహసీల్దార్లు బ్రహ్మశ్వర్ రావు, కరుణాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story