Adulterated Milk: పాల పేరుతో విషం.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు తయారీ!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ పాల కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసుల దాడి. కేమికల్స్, పాలపొడితో నకిలీ పాల తయారీ గుట్టురట్టు.
Adulterated Milk: పాల పేరుతో విషం.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు తయారీ!
Adulterated Milk: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రమాదకరమైన కల్తీ పాల తయారీ ముఠా గుట్టును రాచకొండ ఎస్‌వోటీ (SOT) పోలీసులు రట్టు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో రహస్యంగా నిర్వహిస్తున్న ఒక కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసులు శనివారం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. మానవ శరీరానికి తీవ్ర హాని కలిగించే రసాయనాలు మరియు పాలపొడి కాంబినేషన్‌తో నకిలీ పాలను తయారుచేసి మార్కెట్లోకి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రత్యక్షంగా గుర్తించారు.
ఈ దాడుల సమయంలో కల్తీ పాల తయారీకి ఉపయోగిస్తున్న ప్రమాదకర హైడ్రోజన్ పెరాక్సైడ్, భారీగా పాలపొడిని ఎస్‌వోటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. స్థావరం నుంచి సుమారు 100 లీటర్ల తయారైన కల్తీ పాలు, 35 పాలపొడి ప్యాకెట్లతో పాటు రసాయన సీసాలను పోలీసులు సీజ్ చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించేందుకు నిర్వాహకులు ఈ రసాయన కల్తీ దందాకు తెరలేపినట్లు విచారణలో తేలింది.
సంఘటనా స్థలంలో ఉన్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై తీవ్రమైన కేసులు నమోదు చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసేలా కల్తీ ఆహారపదార్థాలు, పాలు విక్రయించే వారిపై పిడి యాక్ట్ సహా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కల్తీ పాల కేంద్రం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు మరియు వీటిని నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.




