Rangam Bhavishyavani: విగ్రహ ప్రతిష్ట చేయకపోతే వాడవాడలా ప్రాణనష్టమే.. అమ్మవారి తీవ్ర ఆగ్రహం.. సంచలన హెచ్చరికలు!

Rangam Bhavishyavani: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 10:31 AM IST
Rangam Bhavishyavani
X

Rangam Bhavishyavani: విగ్రహ ప్రతిష్ట చేయకపోతే వాడవాడలా ప్రాణనష్టమే.. అమ్మవారి తీవ్ర ఆగ్రహం.. సంచలన హెచ్చరికలు!

Rangam Bhavishyavani: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 'రంగం' భవిష్యవాణి కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత సంచలన, తీవ్ర హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అమ్మవారి స్వరూపంగా పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తూ.. భక్తులు, ఆలయ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగం సందర్భంగా మాతంగి స్వర్ణలత మాట్లాడుతూ.. "నేను ఈసారి సంతోషంగా రాలేదు, తీవ్రమైన క్రోధంతో వచ్చాను. ప్రతీ ఏడాదీ నేను చెప్పిన మాటలను ఎవరూ ఆచరించడం లేదు. నన్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నారు. గతంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మాట ఇచ్చి.. ఇప్పటివరకు దాన్ని నెరవేర్చకుండా విస్మరించారు" అని విమర్శించారు.

దేశ, రాష్ట్ర భవిష్యత్తుపై మాట్లాడుతూ.. ఈ ఏడాది పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని చెబుతూనే, విపత్తుల పట్ల తీవ్ర హెచ్చరికలు చేశారు. "ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. కుంభవర్షాలు కురిసి జనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. సమాజంలో వావి వరుసలు లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిని నేను ఎంతమాత్రం వదిలిపెట్టను" అని స్పష్టం చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని ప్రస్తావిస్తూ.. పిల్లలను ఊరిమీద వదిలేసినట్లు ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కోరిక విగ్రహ ప్రతిష్ట మాత్రమేనని పునరుద్ఘాటించిన అమ్మవారు భక్తులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. "ప్రతీ ఏడాదీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, పరిహారాలు చెప్పాను. కానీ ఈ ఏడాది నన్ను చాలా బాధపెట్టారు. ఇప్పటికైనా ఆరు నెలల లోపు విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా ప్రాణనష్టం జరుగుతుంది. నాకు అడ్డువచ్చిన వారిని నా పాదాల కింద నలిపేస్తూ ముందుకు సాగుతాను.. ఇంక ఎవరినీ క్షమించేది లేదు" అని హెచ్చరించారు.

అయితే, ఇచ్చిన మాట ప్రకారం విగ్రహ ప్రతిష్ట పూర్తిచేస్తే అమ్మవారు కోరినంత కొంగు బంగారమై నిలుస్తుందని, భక్తులు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని భవిష్యవాణిలో వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story