Rare Medical Feat: హైదరాబాద్‌లో అరుదైన శస్త్రచికిత్స.. మహిళ కడుపులో 11 కిలోల భారీ కణతి
Rare Medical Feat: హైదరాబాద్ నగరంలో వైద్యులు ఒక అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి శభాష్ అనిపించుకున్నారు.
Rare Medical Feat
Rare Medical Feat: హైదరాబాద్ నగరంలో వైద్యులు ఒక అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి శభాష్ అనిపించుకున్నారు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల అనీస్ ఫాతిమా అనే మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రోజురోజుకూ ఆమె కడుపు పరిమాణం అసాధారణంగా పెరుగుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో సెప్టెంబర్ 10న పాతబస్తీ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నారు.
వైద్య పరీక్షల్లో దిగ్భ్రాంతికర నిజం
మహిళను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యులు పలు కీలకమైన స్కానింగ్‌లు నిర్వహించారు. రిపోర్టులు చూసిన వైద్యులకే ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆమె గర్భాశయం లేదా కడుపు భాగంలో సాధారణమైన గడ్డ కాకుండా, ఏకంగా 11 కిలోల 200 గ్రాముల బరువున్న భారీ కణతి పెరిగినట్లు గుర్తించారు. అంత భారీ కణతి కడుపులో ఉండటం వల్ల ఆమె ఇతర అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి, కుటుంబ సభ్యుల అంగీకారంతో శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు.
విజయవంతంగా కణతిని తొలగించిన డాక్టర్లు
ఆసుపత్రికి చెందిన అనుభవజ్ఞులైన మహిళా సర్జన్, వైద్యుల బృందం ఎంతో పకడ్బందీగా ఈ క్లిష్టమైన సర్జరీని నిర్వహించింది. గంటల తరబడి శ్రమించి, రోగికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా కడుపులో నుంచి ఏకంగా 11.2 కేజీల బరువున్న రాక్షస కణతిని విజయవంతంగా బయటికి తీశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు సుమారు 10 కిలోల బరువున్న కణతిని తొలగించిన ఘటనే ఇప్పటివరకు రికార్డుగా ఉండగా, ఇప్పుడు ఏకంగా 11 కిలోల కణతిని తొలగించడం ద్వారా వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు.
కోలుకున్న రోగి.. వైద్యులపై ప్రశంసల వర్షం
విజయవంతమైన ఈ శస్త్రచికిత్స తర్వాత అనీస్ ఫాతిమా ఆరోగ్యం కుదుటపడుతోందని, ఆమె క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్లే పెను ప్రమాదం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు మధ్యతరగతి, పేద ప్రజలకు ఎటువంటి ఆర్థిక భారాలు లేకుండా, తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే తమ ఆసుపత్రి పనిచేస్తోందని డాక్టర్ వెల్లడించారు. ఖరీదైన వైద్యం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదన్న ధ్యేయంతో సేవలు అందిస్తున్నామని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు , స్థానికులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.




