Hyderabad: అనుమానంతో దారుణం: మొదటి భార్య చెల్లెలిని పెళ్లాడి.. తుపాకీతో కాల్చి చంపాడు!

Hyderabad: హైదరాబాద్‌ మల్కాజిగిరిలో ఘోర జంట కలకలం రేగింది. భార్యపై అనుమానంతో ఓ స్థిరాస్తి వ్యాపారి తుపాకీతో కాల్చి చంపాడు.

Arun Chilukuri
Published on: 10 Jun 2026 12:38 PM IST
Hyderabad
X

Hyderabad: అనుమానంతో దారుణం: మొదటి భార్య చెల్లెలిని పెళ్లాడి.. తుపాకీతో కాల్చి చంపాడు!

Hyderabad: హైదరాబాద్ లో మరోమారు తుపాకీ గర్జించింది. భార్యపై ఉన్న అనుమానంతో ఓ స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారి అమెను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మారుతీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా భార్య నిషారాణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అరుణ్, ఆమెతో నిరంతరం గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ‘మాట్లాడుకుందాం’ అని చెప్పి మరో వ్యక్తిని వెంటబెట్టుకుని అరుణ్‌కుమార్‌ ఇంటికి వచ్చాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, ముందే ప్లాన్ చేసుకున్న అరుణ్.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి భార్య నిషారాణిపై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ కేసులో నిందితుడి నేపథ్యం విస్తుగొలిపేలా ఉంది. అరుణ్ కుమార్‌కు గతంలోనే వివాహం కాగా, మొదటి భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత ఆమె స్వయంగా సోదరి అయిన నిషారాణిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వీరి కాపురంలో అనుమానం పెనుభూతంగా మారి చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. తెల్లవారుజామున కాల్పుల శబ్దం విన్న స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం మూడు నెలల క్రితమే అంబర్‌పేట ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తుండగా.. అరుణ్‌కుమార్‌ అక్రమ తుపాకీతో పోలీసులకు దొరికిపోయాడు. అప్పట్లో పోలీసులు ఆ తుపాకీని సీజ్ చేశారు. అయితే భార్యను ఎలాగైనా అంతమొందించాలనే పగతో ఉన్న అరుణ్.. పాతబస్తీకి చెందిన కొందరు స్నేహితుల ద్వారా రహస్యంగా మరో కొత్త తుపాకీని కొనుగోలు చేసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story