తుపాకీ వీడి.. టూరిస్ట్ గైడ్లుగా మారి.. మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన!
Giri Darshak Guides: తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ‘గిరి దర్శక్’ గైడ్లుగా ఉద్యోగాలు కల్పించింది. ఎస్ఐబీ, పర్యాటక శాఖ శిక్షణ పూర్తి చేసుకున్న వీరు భద్రాచలం, ములుగు వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు.
తుపాకీ వీడి.. టూరిస్ట్ గైడ్లుగా మారి.. మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన!
Giri Darshak Guides: ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు పునరావాసం కల్పించే ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. లొంగిపోయిన మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేలా వారికి రాష్ట్ర పర్యాటక శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ‘గిరి దర్శక్’ గైడ్ల పేరుతో వారు ఇకపై పర్యాటకులకు మార్గనిర్దేశం చేయనున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక రంగంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మరియు పర్యాటక శాఖ సంయుక్తంగా నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో, ప్రభుత్వం వారిని అధికారికంగా విధుల్లోకి తీసుకుంది. వీరంతా ప్రధానంగా పర్యాటక ప్రాంతాలైన కర్రెగుట్టలు, భద్రాచలం, ములుగు జిల్లాల్లో గైడ్లుగా సేవలు అందించనున్నారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టులు హింసను వీడి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ సత్ఫలితాలను ఇస్తోంది. లొంగిపోయిన వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వాల హామీతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా లొంగుబాట్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
ఒకప్పుడు అడవి బాట పట్టిన వారు, ఇప్పుడు పర్యాటక గైడ్లుగా మారి గిరిజన ప్రాంతాల విశిష్టతను, పర్యాటక సొబగులను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.




