Karimnagar: కోత దశలో వాన దెబ్బ.. గంగాధర రైతుల్లో మొదలైన టెన్షన్!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో మంగళవారం కురిసిన చిరుజల్లులతో ఎండ వేడి తగ్గి వాతావరణం చల్లబడింది.
Karimnagar: కోత దశలో వాన దెబ్బ.. గంగాధర రైతుల్లో మొదలైన టెన్షన్!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి కురిసిన చిరుజల్లులు స్థానిక ప్రజలకు కొంత ఊరటను అందించాయి. గత కొద్ది రోజులుగా మండుతున్న ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనంగా మారింది.
రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలోనే ఈదురు గాలులు ప్రారంభమై, వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి వర్షం కురవడంతో గ్రామాలన్నీ చల్లని వాతావరణంతో కప్పబడ్డాయి.
ఈ అకాల వర్షంతో ఒకవైపు ఎండ తాపం తగ్గి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పంట కోత సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వర్షం పడటం వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ చిరుజల్లులు వాతావరణాన్ని చల్లబరుస్తూనే, రైతుల మనసుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.




