CM Revanth Reddy: ఇది నన్ను కాదు.. తెలంగాణను అవమానించడమే!
CM Revanth Reddy: తెలంగాణను ప్రగతి పథంలో నడిపించేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను చేపట్టిన విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
CM Revanth Reddy: ఇది నన్ను కాదు.. తెలంగాణను అవమానించడమే!
CM Revanth Reddy: తెలంగాణను ప్రగతి పథంలో నడిపించేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను చేపట్టిన విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని భావిస్తే, కేంద్రం మాత్రం సంకుచిత రాజకీయ ధోరణితో నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక ముఖ్యమంత్రికి జరిగింది కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానించడమేనని స్పష్టం చేశారు.
రాజకీయ వివక్షే కారణం.. ఇంగ్లాండ్‌కు ఓకే, అమెరికాకు నో ఎందుకు?
తన పర్యటన దరఖాస్తులో క్లియర్ వివరాలు లేవంటూ ప్రచారం చేస్తున్న విదేశాంగ శాఖ (MEA) ప్రకటనలను, బీజేపీ నేతల వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా విదేశీ యూనివర్సిటీలు, పరిశ్రమలు, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని విదేశాంగ శాఖకు స్పష్టంగా వివరించినట్లు తెలిపారు.
లండన్, అమెరికా పర్యటనలకు ఒకే రకమైన ప్రపోజల్స్ సమర్పించినప్పుడు.. ఇంగ్లాండ్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అమెరికా వెళ్లేందుకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఎందుకు నిరాకరించారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పర్యటనలో విషయం లేకపోతే అసలు లండన్‌కు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు.
'వైబ్రెంట్ గుజరాత్'కు లేని ఆంక్షలు.. తెలంగాణకు ఎందుకు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం మొత్తానికి ప్రధానిలా కాకుండా కేవలం 'గుజరాతి'గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైబ్రెంట్ గుజరాత్ 2047 రోడ్‌షోల పేరుతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు అమెరికా, కెనడాల్లో పర్యటించేందుకు కేంద్రం సులభంగా అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు.
అదే తెలంగాణ అభివృద్ధి కోసం, విదేశీ పెట్టుబడుల సాధన కోసం తాను అమెరికా పర్యటనకు వెళ్తానంటే మాత్రం ఆంక్షలు విధించి అడ్డుకోవడం తీవ్ర వివక్షకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా దేశంలోని అనేకమంది నాయకులు, కోట్లాది మంది ప్రజలు తప్పుబడుతున్నారని పేర్కొన్నారు.
పర్యటనను అడ్డుకోగలరు.. ప్రగతి ఆలోచనను కాదే..
కేంద్ర ప్రభుత్వం తన పర్యటనను భౌతికంగా మాత్రమే అడ్డుకోగలదని, కానీ తెలంగాణ అభివృద్ధిపై ఉన్న తన ఆలోచనలను, విజన్‌ను ఆపలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర అధికారుల బృందాన్ని, ప్రతినిధులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అమెరికాకు పంపించామని, అక్కడ కీలకమైన ఒప్పందాలు (MoUs) యథావిధిగా జరుగుతున్నాయని వెల్లడించారు.
సాధారణంగా ఏ అధికారిక విదేశీ పర్యటన జరిగినా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయం ప్రతి సమావేశంలో పాల్గొంటుందని, ప్రొటోకాల్ ప్రకారం అన్ని సమీక్షించి నివేదికను కేంద్రానికి పంపుతుందని వివరించారు. గుజరాత్ నాయకత్వం తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడాన్ని ఓర్చుకోలేకపోతోందని ఆరోపించారు. కేంద్రం చూపిన ఈ ఫెడరల్ వ్యతిరేక వైఖరిపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా నిలదీస్తామని, ఈ అంశాన్ని తెలంగాణ వాదులంతా ఏకకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.




