Revanth Reddy: నీటి హక్కుల్లో రాజీ పడేది లేదు.. రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం!

Revanth Reddy: గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 12:30 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: నీటి హక్కుల్లో రాజీ పడేది లేదు.. రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం!

Revanth Reddy: "తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్య, వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మాట్లాడిన సీఎం..ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, 8 కొత్త మెడికల్ కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

గతంలో విద్యా సూచీలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 14వ స్థానానికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికో 'ఇంటిగ్రేటెడ్ స్కూల్' నిర్మించడంతో పాటు, 100కు పైగా 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ నియామకాలలో అక్రమాలకు తావులేకుండా టీజీపీఎస్సీ (TGPSC)ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు.

టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, దీనిద్వారా మరో 78 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCC) కేరాఫ్ అడ్రస్‌గా మార్చామని, ఇప్పటికే 355కు పైగా జీసీసీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రఖ్యాత అమెజాన్ (Amazon) సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని ప్రకటించారు.

"కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నాం. అందులో భాగంగానే మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశాం. ఈరోజే రాష్ట్రంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు, రెండో విడత పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. అంతేకాకుండా వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ కావడం మన అందరికీ గర్వకారణం" అని సీఎం వివరించారు.

అలాగే క్రీడా రంగానికి ఊతమిచ్చేలా 'సీఎం కప్' పోటీలు నిర్వహించామని, త్వరలో జరగబోయే 'ఖేల్ ఇండియా' పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story