Rythu Bharosa : కిలోమీటర్ల క్యూలు ఉండవు..విడతల వారీ వెయిటింగ్ ఉండదు..రైతు భరోసా పంపిణీలో కొత్త విధానం

Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా పంపిణీలో కొత్త విధానం అమలు కానుంది. మార్చి 22 నుంచి అందరికీ ఒకేసారి మొదటి ఎకరం నిధులు జమ కానుండగా, కొత్త దరఖాస్తులకు మార్చి 25 వరకు గడువు ఇచ్చారు.

CR Reddy
Published on: 19 March 2026 10:50 AM IST
Rythu Bharosa
X

 Rythu Bharosa

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పంపిణీలో పాత పద్ధతిని పూర్తిగా మార్చేసింది. గతంలో తక్కువ భూమి ఉన్న వారికి ముందుగా డబ్బులు వేయడం వల్ల, ఎక్కువ భూమి ఉన్న రైతులకు సాగు సీజన్ అయిపోయిన తర్వాత కూడా నిధులు అందేవి కావు. దీనిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈసారి ఎంత భూమి ఉన్నా సరే.. ప్రతి రైతుకు మొదటి ఎకరానికి సంబంధించిన రూ.6,000 నిధులను తొలి విడతలోనే జమ చేయాలని ఆదేశించారు. అంటే ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉన్నా, పది ఎకరాలు ఉన్నా.. అందరికీ ఒకేసారి మొదటి ఎకరం నిధులు అకౌంట్లో పడతాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులు ఒకే రోజు లబ్ధి పొందనున్నారు.

మార్చి 22 నుంచి నిధుల విడుదల

ఈ నెల 22వ తేదీన నర్మెట్టలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. తొలి విడత కోసం ప్రభుత్వం ఏకంగా రూ.3,590 కోట్లు కేటాయించింది. మొదటి విడత నగదు అందిన 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి. కేవలం మూడు విడతల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి, మే నెలలో వానాకాలం సాగు పనులకు రైతులు సిద్ధమయ్యేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లే అవసరం ఉండదని సర్కార్ భావిస్తోంది.

కొత్తగా భూమి కొన్నారా?

పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా వ్యవసాయ భూమి కొన్న వారికి కూడా రేవంత్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 2026 వరకు పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ లోపు మీ గ్రామంలోని రైతు వేదిక వద్ద లేదా రైతు విస్తరణ అధికారులను సంప్రదించి అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలను జత చేయాలి. అయితే, ఆ భూమి కచ్చితంగా ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలని, వ్యవసాయానికి యోగ్యంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాగు భూమి ఉంటేనే నిధులు

రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఈసారి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగులో లేని కొండలు, గుట్టలకు ఈ పథకం వర్తించదు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాతే నిధులు విడుదల చేస్తారు. ప్రజా ధనం వృధా కాకుండా, అసలైన రైతన్నకు సాయం అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం తగ్గడమే కాకుండా, కష్టపడే రైతుకు తగిన గుర్తింపు లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

CR Reddy

CR Reddy

Next Story