Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే కానుక.. త్వరలోనే 1.3 లక్షల పోస్టుల భర్తీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన రేవంత్ సర్కార్, రాబోయే రెండేళ్ల కాలంలో ఏకంగా 1.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
Telangana Jobs
Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన రేవంత్ సర్కార్, రాబోయే రెండేళ్ల కాలంలో ఏకంగా 1.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే వేల సంఖ్యలో నియామకాలు చేపట్టామని, మిగిలిన పోస్టులను కూడా అతి త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే 70 వేల ఉద్యోగాల భర్తీ
ఢిల్లీలో జరిగిన మంత్రుల ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రాబోయే ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే తమ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 70 వేల ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని గుర్తుచేశారు. దీనికి కొనసాగింపుగా రాబోయే రెండేళ్లలో మిగిలిన 1.3 లక్షల ఉద్యోగాలను కూడా వివిధ శాఖల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ వైఫల్యాలు
గత పాలనలో పోటీ పరీక్షల నిర్వహణలో తీవ్రమైన జాప్యం జరిగిందని, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని సీఎం విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే గ్రూప్-1 పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, డీఎస్సీ పోస్టులను కూడా సకాలంలో భర్తీ చేసి ఉపాధ్యాయ అభ్యర్థుల కలలను సాకారం చేశామని చెప్పారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ నియామక ప్రక్రియను ఎక్కడా అంతరాయం లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
ఈ సమావేశంలో కేవలం ఉద్యోగాల భర్తీ గురించే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఎన్నికలకు ముందుగానే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరగబోయే జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపిక చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నియోజకవర్గాల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను ఓటర్లకు వివరించాలని సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ ఉద్యోగాల భర్తీ ప్రణాళిక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మరింత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.




