RS Praveen Kumar: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. వెంటనే కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలి

RS Praveen Kumar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 15 July 2026 2:50 PM IST
RS Praveen Kumar
X

RS Praveen Kumar: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. వెంటనే కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలి

RS Praveen Kumar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనకు రెండు చోట్ల ఓటు హక్కు ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి 'రెండు ఓట్ల కథ'ను ఆయన బయటపెట్టారు.

ప్రెస్ మీట్‌లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. "2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు వేశారు. కానీ ఆయన సొంత ఊరు కొండారెడ్డి పల్లి. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 18 ప్రకారం ఒక వ్యక్తి రెండు చోట్ల ఓటు నమోదు చేసుకోకూడదు. కానీ రేవంత్ రెడ్డికి కొడంగల్‌తో పాటు కొండారెడ్డిపల్లిలోనూ ఓటు ఉంది. సీఎం హోదాలో ఉండి ఇలా రెండు ఓట్లు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం. రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు ఉందనే విషయాన్ని 'ఫాక్ట్ చెక్ తెలంగాణ' అనే సంస్థ నిరూపించింది. దీంతో సీఎం చట్టానికి దొరికిపోయారు" అని పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి ఓటును తొలగించామని జిల్లా కలెక్టర్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. "రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వకుండా ఓటు ఎలా డిలీట్ చేస్తారు? నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి ఫామ్ సబ్మిట్ చేశారా? ఆయనకు నోటీసు ఇచ్చారా? దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమాధానం చెప్పాలి. రాత్రికి రాత్రే ఓటు డిలీట్ చేసినందుకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓలను బాధ్యులను చేయాలి. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారా లేక కేంద్ర ఎన్నికల సంఘం నడుపుతుందా?" అని ప్రశ్నించారు.

గతంలో నటుడు ప్రకాష్ రాజ్‌కు రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని కేసు పెట్టారని గుర్తుచేసిన ప్రవీణ్ కుమార్.. రేవంత్ రెడ్డి విషయంలో ఒక న్యాయం, ప్రకాష్ రాజ్‌కు మరో న్యాయమా అని నిలదీశారు. రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తూ బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెంటనే సుమోటోగా యాక్షన్ తీసుకుని, రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అక్రమాన్ని బయటపెట్టిన 'ఫాక్ట్ చెక్ తెలంగాణ' సంస్థపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.

గురుకులాల అవినీతి ఆరోపణలపై కూడా ప్రవీణ్ కుమార్ స్పందించారు. "82 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందనే ప్రచారం ఎంత అబద్ధమో.. కేవలం 800 కోట్ల బడ్జెట్ ఉన్న గురుకులాల్లో వేల కోట్ల అవినీతి జరిగిందనడం అంతే అబద్ధం. గతంలో ఇదే గువ్వల బాలరాజు నన్ను ఎంతో పొగిడారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గువ్వల బాలరాజు ముగ్గురూ కలిసి నాపైన లేఖలు రిలీజ్ చేస్తూ కుట్రలు చేస్తున్నారు. నేనే గనుక ఏదైనా నేరం చేసి ఉంటే నన్ను జైలుకు పంపండి.. దేనికైనా సిద్ధం" అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story