RTC Strike Tragedy: సంచలనం సృష్టించిన ఆర్టీసీ కార్మికుడి మృతి.. వరంగల్ బంద్‌కు జేఏసీ పిలుపు
RTC Strike Tragedy: ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం నెలకొంది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేశారు. దీంతో వరంగల్ జిల్లా బంద్‌కు జేఏసీ పిలుపు నిచ్చింది.
RTC Strike Tragedy
RTC Strike Tragedy: ఆర్టీసీ సమ్మెలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఒక సామాన్య కార్మికుడు బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృత్యువుతో పోరాడి ఓడిపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన సమ్మె సెగను మరింత రాజేసింది. ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతున్న వేళ, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఒళ్ళంతా కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్న ఆయనను వెంటనే వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. సుమారు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో పోరాడిన ఆయన, నేటి తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
శంకర్ గౌడ్ మృతి వార్త తెలియగానే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ అర్ధరాత్రి ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు తోడుగా ఉంటుందని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు ఇవాళ నర్సంపేటకు వెళ్లనుండటంతో రాజకీయంగా మరింత ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కూడా కార్మికులకు మద్దతుగా రంగంలోకి దిగింది.
శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో హనుమకొండ, నర్సంపేట, వరంగల్ ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు భారీ ఎత్తున ధర్నాలకు దిగాయి. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నర్సంపేటలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
శంకర్ గౌడ్ ఆత్మబలిదానంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని, ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. కాసేపట్లో శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేటకు తరలించనున్నారు. ఆయన అంతిమ యాత్రలో వేలాది మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉండటంతో ఉద్రిక్తత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా దిగివచ్చి కార్మికులతో చర్చలు జరుపుతుందో లేదో చూడాలి.




