Konda Surekha: కమలం గూటికి కొండా సురేఖ..? చక్రం తిప్పిన ఎంపీ!

Konda Surekha: మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ వేటు వేస్తే బీజేపీలోకి ఆహ్వానించేందుకు కమలం నేతలు సిద్ధమవుతున్నారు.

Gagan kumar
Published on: 30 Aug 2026 9:55 AM IST
Konda Surekha
X

Konda Surekha: కమలం గూటికి కొండా సురేఖ..? చక్రం తిప్పిన ఎంపీ!

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, ముఠా తగదాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి కొండా సురేఖ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం సురేఖపై క్రమశిక్షణా వేటు వేస్తే, ఆమెను తమ గూటికి చేర్చుకోవాలని కమలం నాయకత్వం గుట్టుచప్పుడు కాకుండా చక్రం తిప్పుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

పీసీసీ క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరందుకున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆమెకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలున్న తెలంగాణకు చెందిన ఒక ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఇప్పటికే కొండా మురళితో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సెప్టెంబరు 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఒకవేళ సురేఖపై వేటు పడితే... కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతుందా? లేక కమలం తీర్థం పుచ్చుకుని హస్తం పార్టీకి షాక్ ఇస్తుందా? అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది.

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీకి బలమైన పునాదులు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో ఈ ప్రాంతాల నుంచే ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, ఒకప్పుడు హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత సరైన మాస్ లీడర్ లేకపోవడంతో ఆ జిల్లాలో పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు కొండా దంపతుల రూపంలో ఒక బలమైన మాస్ లీడర్‌షిప్‌ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరిగి జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది.

త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీని పార్టీలోకి ఆహ్వానించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొండా దంపతులకు వరంగల్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వర్గం ఓటర్లలో తిరుగులేని ఇమేజ్ ఉంది. కొండా కుటుంబం బీజేపీలో చేరితే, రాబోయే వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం సులువవుతుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వాళ్ల సొంత కోటలోనే కోలుకోలేని దెబ్బ తీయవచ్చని భావిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే ఆ ఒక్క నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ రకమైన భూకంపం సృష్టిస్తుందో చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story