Revanth Reddy: ఒకనాటి 'గొల్లంకొండ'నే నేటి గోల్కొండ.. సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సదర్ సమ్మేళనం రాష్ట్ర పండుగగా గుర్తింపు, రూ. 5 కోట్లు మంజూరు మరియు కులగణనపై పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 5:03 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: ఒకనాటి 'గొల్లంకొండ'నే నేటి గోల్కొండ.. సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే చారిత్రాత్మక సదర్ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. సదర్ సమ్మేళనం కేవలం యాదవులకే కాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మగౌరవ సమ్మేళనమని ఆయన అభివర్ణించారు.

హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందడంలో యాదవ సోదరుల పాత్ర, సహకారం ఎంతో కీలకమైనవని సీఎం కొనియాడారు. నగరంలో నేడు ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోట ఒకనాడు 'గొల్లంకొండ' అని గుర్తు చేసిన ఆయన, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ యాదవ సోదరులు ఆదరించి తమ గుండెలకు హత్తుకున్నారని కొనియాడారు.

గతంలో పాలించిన ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాదవుల కోరిక మేరకు సదర్ ఉత్సవాలను అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించడమే కాకుండా, ఈ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రూ. 5 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వంలో యాదవులకు సముచిత రాజకీయ ప్రాధాన్యత, ఆత్మగౌరవం కల్పించామని చెబుతూ, అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని, అలాగే ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించామని వెల్లడించారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట ప్రాంగణంలోని గోశాలలో గోసంరక్షణ సమర్థవంతంగా చేపట్టేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణను దేశంలోనే సరికొత్త మోడల్‌గా నిలిపేందుకు కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి చూపించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు దక్కాల్సిన న్యాయమైన వాటా ఖచ్చితంగా దక్కేలా చర్యలు తీసుకుంటామని, వారి ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్నదే తమ ఆశయమని పేర్కొన్న సీఎం, మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ మరియు ప్రతిష్టాత్మక 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యాదవ సోదరులందరూ సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.