Weapons Stolen: సికింద్రాబాద్ ఆర్మీ ఆయుధాల దొంగతనం కేసులో షాకింగ్ ట్విస్ట్
Weapons Stolen: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 20 మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో అత్యంత భద్రత నడుమ ఉండాల్సిన ఆర్మీ ఆయుధాలు దొంగతనానికి గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Weapons Stolen
Weapons Stolen: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో చోటుచేసుకున్న ఈ భారీ ఆయుధాల దొంగతనం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 20 మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఒక ఉన్నతాధికారిని ఆర్మీ సీనియర్ అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్మీ డిపోలోని ఆయుధాల రికార్డులు, రిజిస్టర్లను గత కొన్ని నెలలుగా అసలు సరిగ్గా నిర్వహించలేదనే పక్కా సమాచారంతోనే ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది. సైనిక నిబంధనల ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం డిపోలోని ప్రతి ఆయుధాన్ని లెక్కించి రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాంటి కీలకమైన ప్రక్రియలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 31న వెలుగుచూసిన ఘోరం
ఆగస్టు 31వ తేదీ ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో ఈ ఆయుధాల మాయం ఘటన బయటపడింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంచే గది తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఒక సీనియర్ మిలిటరీ అధికారి తక్షణమే మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నివేదిక ప్రకారం ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఆయుధాలను ఆఖరిసారిగా భౌతికంగా లెక్కించి పక్కాగా లాక్ చేశారు. మరుసటి రోజు ఉదయానికి తాళాలు పగిలిపోయి లోపల ఉన్న విలువైన సామగ్రి గాల్లో కలిసిపోవడం తీవ్ర కలకలం రేపింది.
మాయమైన ఆయుధాల జాబితా ఇదే
ఆర్మీ క్యాంప్ నుంచి మాయమైన ఆయుధాల జాబితా చూస్తే ఎంతటి వారికైనా ఒళ్లు గగుర్పాటుకు గురికాక తప్పదు. అత్యంత శక్తివంతమైన 4 ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు, 7 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు ఏకంగా 1,000 రౌండ్లకు పైగా ప్రాణాంతక మందుగుండు సామగ్రి గాల్లో కలిసిపోయాయి. వీటితో పాటు రాత్రి వేళల్లో శత్రువులను కనిపెట్టే ఒక జత పాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్లు కూడా మాయమయ్యాయి. అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట నుంచి ఇన్ని ఆయుధాలు బయటకు వెళ్లడం వెనుక లోపలి వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆగస్టు 30కి ముందే ఆయుధాలు మాయమయ్యాయా?
ఆగస్టు 30, 31 మధ్య రాత్రి వేళలోనే ఈ చోరీ జరిగిందని పోలీసులు మొదట భావించారు. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆయుధాలు అంతకు ముందే మాయమై, సంఘటనను కప్పిపుచ్చేందుకు తాళాలు పగలగొట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎలాంటి అనుమానాస్పద కదలికలను చూడలేదని చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా రికార్డులను, అక్కడి సీసీటీవీ దృశ్యాలను జల్లెడ పడుతున్నాయి.




