Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ కలకలం.. సూడాన్ ప్రయాణికుడి గుర్తింపు, గాంధీ ఐసోలేషన్‌కు తరలింపు!

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ కలకలం రేపింది. సూడాన్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి ఎబోలా హిస్టరీ ఉన్నట్లు స్క్రీనింగ్‌లో గుర్తించారు.

Arun Chilukuri
Updated on: 4 Jun 2026 3:35 PM IST
Hyderabad
X

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ కలకలం.. సూడాన్ ప్రయాణికుడి గుర్తింపు, గాంధీ ఐసోలేషన్‌కు తరలింపు! 

Hyderabad: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్ట్) లో గురువారం తీవ్ర కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన ఒక అంతర్జాతీయ ప్రయాణికుడికి ప్రాణాంతక ‘ఎబోలా వైరస్’ (Ebola Virus) హిస్టరీ ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయ రక్షణ మరియు వైద్య సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సూడాన్ (Sudan) దేశం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మహ్మద్‌ అనే ప్రయాణికుడు చేరుకున్నాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్త్ స్క్రీనింగ్‌ కేంద్రంలో అతనికి పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సదరు ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ (లక్షణాలు లేదా గత రికార్డులు) ఉన్నట్లు స్క్రీనింగ్ వైద్య సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు.

ఎబోలా హిస్టరీ బయటపడటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సిబ్బంది అత్యవసర అంబులెన్స్‌లో సదరు ప్రయాణికుడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎబోలా వంటి ప్రమాదకర వైరస్‌లు ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర ఐసోలేషన్‌ సెంటర్‌ (Isolation Center) లో అతడిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహ్మద్‌ నుంచి రక్తం మరియు ఇతర శరీర ద్రవాల నమూనాలను (Samples) సేకరించిన వైద్యులు.. ఎబోలా వైరస్ ఉందో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి వాటిని హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా కేంద్రం సీసీఎంబీ (CCMB) కి పంపించారు. సీసీఎంబీ నివేదిక వస్తేనే అతనికి ప్రస్తుతం ఎబోలా యాక్టివ్‌గా ఉందా లేదా అనేది స్పష్టమవుతుందని గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story