Shocking: రూ.10 కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన ప్రయాణికురాలు
Shocking: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
RTC Conductor Attack
Shocking: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో కేవలం రూ.10 చిల్లర విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం చివరికి ఓ మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. విధుల్లో ఉన్న మహిళా ఆర్టీసీ కండక్టర్‌ను ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేయడంతో ఈ విషాదకర ఘటన జరిగింది. కండక్టర్ బస్సులోంచి కిందపడిపోవడమే కాకుండా, అదే బస్సు వెనుక చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
అసలేం జరిగింది?
వివరాల్లోకి వెళ్తే.. అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలసి ప్రయాణిస్తోంది. బాబు టికెట్ కోసం కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. టికెట్ ధర రూ.10 కాగా, మిగిలిన రూ.90 చిల్లరను ప్రయాణం పూర్తయ్యేలోగా ఇస్తానని కండక్టర్ ప్రవళిక చెప్పింది. అయితే వెంటనే చిల్లర ఇచ్చేయాలని మౌనిక పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఒకరిపై ఒకరు ఆగ్రహంతో ఊగిపోతూ నెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ క్రమంలో మౌనిక నెట్టివేయడంతో కండక్టర్ ప్రవళిక ఫుట్‌బోర్డ్ పై నుంచి బస్సు బయటకు పడిపోయింది.
రెండు కాళ్లు నుజ్జునుజ్జు
కండక్టర్ ప్రవళిక బస్సు కింద పడగానే క్షణాల వ్యవధిలోనే బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్లపై నుంచి వెళ్లాయి. దీంతో రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సును నిలిపివేశారు. 108 అంబులెన్స్ ద్వారా బాధితురాలిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. చిన్న చిల్లర గొడవ ఈ స్థాయి ఘోరానికి దారితీయడంతో తోటి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పరస్పర ఆరోపణలు
ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో ప్రయాణికురాలు మౌనిక తన వివరణ ఇచ్చింది. ఘటనలో తన తప్పేమీ లేదని, చిల్లర డబ్బుల విషయంలో కండక్టరే గొడవపడిందని ఆరోపించింది. ప్రవళిక ఫుట్‌బోర్డు వద్ద నిలబడడం వల్ల ప్రమాదవశాత్తూ జారి పడిపోయిందని చెబుతోంది. కాగా ఆర్టీసీ సిబ్బంది మాత్రం ప్రయాణికురాలి ప్రవర్తన వల్లే కండక్టర్ కిందపడిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.




