Siddipet: పెళ్లి వేడుకలో సంతోషం.. తిరుగు ప్రయాణంలో విషాదం: హల్దీ వాగులో ముగ్గురు స్నేహితుల మృతి!

Siddipet: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం హల్దీ వాగులో ముగ్గురు యువకుల మృతి. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్, వికాస్, ఆనంద్ రెడ్డిగా గుర్తింపు. ఈతకు వెళ్లి మునిగిపోయిన స్నేహితులు.

Arun Chilukuri
Published on: 7 May 2026 3:32 PM IST
Siddipet
X

Siddipet: పెళ్లి వేడుకలో సంతోషం.. తిరుగు ప్రయాణంలో విషాదం: హల్దీ వాగులో ముగ్గురు స్నేహితుల మృతి!

Siddipet: శుభకార్యానికి వెళ్లి సంతోషంగా తిరిగి రావాల్సిన ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులను ‘ఈత’ సరదా బలితీసుకుంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలోని హల్దీ వాగులో మునిగి మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) అనే ముగ్గురు స్నేహితులు బుధవారం తూప్రాన్‌లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం నాచారం సమీపంలోని హల్దీ వాగులో ఈతకు దిగారు. అయితే, వాగులో నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో ముగ్గురూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. కొన్ని గంటల శ్రమ అనంతరం ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. చదువుకుని ప్రయోజకులవ్వాల్సిన 27 ఏళ్ల యువకులు ఒకేసారి విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పిన కొడుకులు శవాలై రావడంతో నర్సాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నీటి ప్రవాహాలు, వాగుల వద్ద యువత అప్రమత్తంగా ఉండాలని, లోతు తెలియకుండా నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story