Vikarabad: తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. ఎస్పీ స్నేహ మెహ్రా హర్షం!
Vikarabad: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. గత డిసెంబర్ తో పోలిస్తే మార్చి 2026 నాటికి మరణాల సంఖ్య 70 శాతం తగ్గడం విశేషం.
Vikarabad: తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. ఎస్పీ స్నేహ మెహ్రా హర్షం!
Vikarabad: జిల్లా పోలీసు యంత్రాంగం క్రమబద్ధమైన ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం మరియు ప్రజలలో పెరుగుతున్న అవగాహన ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐ.పి.ఎస్. గారు హర్షం వ్యక్తం చేశారు. గతy నాలుగు నెలల గణాంకాలను సమగ్రంగా విశ్లేషిస్తే, ముఖ్యంగా మార్చి 2026 నెలలో ప్రమాదాలు మరియు ప్రాణనష్టం గణనీయంగా తగ్గడం జిల్లాలో చేపట్టిన చర్యల ప్రభావాన్ని స్పష్టంగా చూపుతోందని ఆమె తెలిపారు.
గణాంకాల విశ్లేషణ: తగ్గుతున్న ప్రమాదాల ధోరణి.
గత డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 వరకు జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల వివరాలను పరిశీలిస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది:
• డిసెంబర్ 2025: మొత్తం 37 ప్రమాదాలు జరగ్గా, అందులో 25 మరణాలు సంభవించాయి.
• జనవరి 2026: ప్రమాదాల సంఖ్య 20కి తగ్గింది, మరణాల సంఖ్య 10గా నమోదైంది.
• ఫిబ్రవరి 2026: ప్రమాదాల సంఖ్య 29కి చేరుకోగా, మరణాల సంఖ్య 18గా ఉంది.
• మార్చి 2026: అత్యంత సానుకూల మార్పుతో ప్రమాదాల సంఖ్య కేవలం 17కి పరిమితమైంది. మరణాల సంఖ్య 7కి తగ్గింది.
డిసెంబర్ నెలతో పోల్చితే మార్చి నెలలో ప్రమాదాల సంఖ్య 50% కంటే ఎక్కువగా తగ్గడం, ప్రాణనష్టం దాదాపు 70% పైగా తగ్గడం పోలీసు శాఖ యొక్క ముందస్తు ప్రణాళికాబద్ధమైన చర్యలకు నిదర్శనమని ఎస్పీ గారు తెలిపారు. ముఖ్యంగా 'ఫాటల్' (ప్రాణాంతక) ప్రమాదాల సంఖ్య 25 నుండి 7కి పడిపోవడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి ప్రాణం అమూల్యమని భావించి, తెలంగాణ గౌరవ డిజిపి గారు ఏర్పాటు చేసిన “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని మూడు దశల్లో జిల్లాలో సమర్థవంతంగా అమలు చేశామని ఎస్పీ గారు తెలిపారు. ద్విచక్ర వాహనదారులలో హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తలకు అయ్యే గాయాల గురించి అవగాహన , అదేవిధంగా డ్రైవర్ల కంటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో పెద్ద మొత్తం లో ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందజేయడం వల్ల దృష్టి లోపాల కారణంగా జరిగే ప్రమాదాల పైన అవగాహన పెంచడం జరిగింది అని ఎస్పీ గారు తెలిపినారు.
రోడ్డు భద్రతలో భాగంగా ఇంజినీరింగ్ పరమైన మార్పులు కూడా చేపట్టినట్లు ఎస్పీ గారు పేర్కొన్నారు..ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను (Black Spots) గుర్తించి, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, హెచ్చరిక సూచిక బోర్డులు అమర్చడం ద్వారా డ్రైవర్లకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అదేవిధంగా రోడ్లపై వేగ నియంత్రణ కోసం “రంబుల్ స్ట్రిప్స్” (Rumble Strips) ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులు స్వయంగా వేగం తగ్గించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముఖ్య కూడళ్ల వద్ద మరియు ప్రమాదకర మలుపుల వద్ద “బొల్లార్డ్స్” (Bollards) ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల మార్గదర్శకత్వం సులభమై, ఢీకొనే ప్రమాదాలు తగ్గాయని వివరించారు. ఈ ఇంజినీరింగ్ మార్పులు ప్రమాదాల తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె అన్నారు.
ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు భద్రతను బలోపేతం చేయడం కోసం సమిష్టి చర్యలు చేపట్టామని ఎస్పీ గారు తెలిపారు. “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, గ్రామస్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక సెషన్లు నిర్వహించి, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించామని చెప్పారు. “మీ ఇంటికి మీరే ఆధారం – వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దు” అనే సందేశాన్ని యువత ద్వారా సమాజానికి చేరవేయడం ద్వారా సానుకూల మార్పు కనిపించిందని ఆమె పేర్కొన్నారు.
కేవలం అవగాహన కార్యక్రమాలకే పరిమితం కాకుండా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం, ఓవర్ స్పీడ్‌పై నిఘా పెట్టడం, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయడం ద్వారా డ్రైవర్లలో బాధ్యతాభావం పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా పాటలు, నాటకాల ద్వారా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను కళ జాత బృందం వివరించడం జరిగింది.
రద్దీగా ఉండే కూడళ్లలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు నిరంతరం ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు జారీ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు మరియు నెంబర్ ప్లేట్స్ మార్చి నడుపుతున్న వాహనాలపైన నిరంతరం నిఘా పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది.
విద్యార్థుల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు (Essay Writing) మరియు సెమినార్లను నిర్వహించాము. చిన్నతనం నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. యువత అతివేగం మరియు అజాగ్రత్త వల్ల ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వారికి ప్రత్యేక సెమినార్ల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి, ట్రాఫిక్ నియమాల పట్ల పూర్తి అవగాహన కల్పించాము.
మొత్తానికి, అవగాహన, అమలు (Enforcement), ఇంజినీరింగ్ మార్పులు మరియు సమిష్టి కృషి వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రజలు ఇదే విధమైన సహకారాన్ని కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ వికారాబాద్ జిల్లాను “ప్రమాద రహిత జిల్లా”గా మార్చడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా గారు పిలుపునిచ్చారు.




