IPL 2026 Traffic Diversions : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ స్టేడియం వైపు వెళ్తున్నారా? ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

IPL 2026 Traffic Diversions : ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు, డైవర్షన్లు ప్రకటించారు.

CR Reddy
Published on: 13 April 2026 8:04 AM IST
IPL 2026 Traffic Diversions
X

IPL 2026 Traffic Diversions 

IPL 2026 Traffic Diversions : హైదరాబాద్‌లో క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు, డైవర్షన్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, ఇప్పటికే ఒకటి పూర్తయింది. మిగిలిన 6 మ్యాచ్‌లు ఏప్రిల్ 13, 18, 21, మే 3, 6, 22 తేదీలలో జరగనున్నాయి. నేడు (సోమవారం) మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు ఉప్పల్ ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. నాగోల్ - హబ్సిగూడ, బోడుప్పల్ - అంబర్‌పేట్ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవడం ఉత్తమం.

భారీ వాహనాలపై నిషేధం

లారీలు, టిప్పర్లు, ట్రక్కులు, ప్రైవేట్ బస్సులు, వాటర్ ట్యాంకర్లు, జేసీబీల వంటి భారీ వాహనాలను మ్యాచ్ సమయంలో ఉప్పల్ మార్గంలో అనుమతించరు. ఘట్‌కేసర్ నుంచి వచ్చే వాహనాలను HMDA ఉప్పల్ భగ్యాత్ మార్గంలో నాగోల్ వైపు మళ్లిస్తారు. తార్నాక నుంచి వచ్చే భారీ వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్ వద్దే నాచారం లేదా చెర్లపల్లి వైపు మళ్లించడం జరుగుతుంది. వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఘట్‌కేసర్ వద్దే ఓఆర్ఆర్ (ORR) ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా నగరం లోపలికి రావాల్సి ఉంటుంది.

పార్కింగ్ ఎక్కడ చేయాలి?

* సాధారణ ప్రేక్షకుల కోసం స్టేడియం బయట 500 మీటర్ల పరిధిలో 4 ప్రధాన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.

* హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వారు: పెంగ్విన్ గ్రౌండ్స్ లేదా TG IALA లో పార్కింగ్ చేయాలి.

* రామంతాపూర్ వైపు నుంచి వచ్చే వారు: DSL ఓపెన్ ల్యాండ్ (NSL బిల్డింగ్ ఎదురుగా) లేదా మోడర్న్ బేకరీ వద్ద వాహనాలు నిలపాలి.

* ఎల్.బి.నగర్ నుంచి వచ్చే వారు: కెమ్‌వేదా జంక్షన్ నుంచి ఇండస్ట్రియల్ లేన్ రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకోవచ్చు.

గమనిక: VVIP/VIP పాస్ ఉన్నవారు మాత్రమే గేట్ 1A ద్వారా స్టేడియం లోపలికి (A గ్రౌండ్ పార్కింగ్) వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

పోలీసుల విజ్ఞప్తి

స్టేడియం వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రేక్షకులు సొంత వాహనాల కంటే ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలని మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సూచించారు. సరైన పార్కింగ్ పాస్ లేని వాహనాలను చెక్ పోస్టుల వద్దే ఆపేస్తామని, కాబట్టి వాహనదారులు పోలీసులకు సహకరించి మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలని కోరారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story